పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కల్వర్టుల పనులకు మోక్షం

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మించాలని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Update: 2025-01-07 02:57 GMT

దిశ, తలకొండపల్లి : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మించాలని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే రెండు మండల కేంద్రాలకు ప్రధాన రహదారైన తలకొండపల్లి నుంచి మిడ్జిల్ మండల కేంద్రం వరకు బీటీ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడానికి దశాబ్ద కాలం క్రితం రూ.22.50 కోట్లను తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ శివారు ప్రాంతం వరకున్న 13.80 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ ఈ రహదారి పనులను పూర్తి చేయడానికి మాత్రం అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అనే చందంగా మారింది పరిస్థితి. ఆనాటి నుంచి నేటి వరకు అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించి సుమారు దశాబ్ద కాలం దగ్గర పడుతున్నా ఆ రోడ్డుకు పట్టిన గ్రహణం మాత్రం పూర్తిస్థాయిలో వీడడం లేదని ఇరు మండలాల ప్రజలు, వాహన చోదకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీనికి ఎవరిది నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యం వెనుక అసలు కారణం ఎవరు? అనేది మాత్రం నేటికీ ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తూ పనులు పూర్తి చేయకపోవడం గత ప్రభుత్వానికి మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఆ రహదారిలో మిగిలిపోయిన ఐదు కల్వర్టులకు పట్టిన గ్రహణాన్ని మాత్రం విడిపించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నో సార్లు ప్రతిపక్ష పార్టీలు ఈ కల్వర్టుల వద్ద వరి నాట్లు వేసి వినూత్న స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసేవారు. ఒక దశలో మండల కేంద్రంలో మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాల్లో సైతం ఎంపీటీసీలు, సర్పంచులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు.

5 కల్వర్టుల కోసం రూ.5.50 లక్షల నిధులతో రీ టెండర్..

ఈ రహదారిలో అసంపూర్తిగా మిగిలిపోయిన 5 కల్వర్టు పనులను పూర్తి చేయడానికి అప్పట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రీ టెండర్ వేసి 2019లో రూ.5.50 లక్షల నిధులు కేటాయించింది. ఆనాటి నుంచి నేటి వరకు నిధులు మంజూరై సుమారు 5 సంవత్సరాలు కావస్తున్నా ఆ కల్వర్టు పనులు ముందుకు వెళ్లకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు కొరకరాని కొయ్యగా తయారయింది. ఒక దశలో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు స్థానిక నేతల కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వర్టు వద్ద తాత్కాలిక మరమ్మతులు చేసి పరువు నిలుపుకోవాలని చూశారు. ప్రతి కల్వర్టు వద్ద అటూఇటుగా సుమారు 200 మీటర్ల చొప్పున రోడ్డును బీటీ వేయకుండా వదిలివేశారు. ఈ కల్వర్టు నిర్మాణ పనులను బీటీ రోడ్డు కన్నా చాలా ఎత్తు వరకు నిర్మించడంతో, ప్రతినిత్యం వందలాదిమంది బైకులు, కార్లలో ప్రయాణించే వాహన చోదకులకు చుక్కలు కనిపించాయి.

వర్షం వచ్చినప్పుడు ఆ కల్వర్టు వద్ద పెద్ద మొత్తంలో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. ఈ రహదారిపై ఉన్న 5 కల్వర్టు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్న కారణంగా అప్పట్లోనే ఆర్ అండ్ బీ అధికారులు రూ.22.50 లక్షల నిధుల నుంచి 5 కల్వర్టుల పెండింగ్ పనుల కోసం రూ.1.69 లక్షల నిధులు కాంట్రాక్టర్ వద్ద నుంచి ఎంబీ రికార్డు చేసి ఉంచారు. ఈ ఐదు కల్వర్టుల వద్ద మిగిలిపోయిన మట్టి రోడ్డును కంకర వేసి బీటీ గా మార్చడానికి నిధులు అందుబాటులో ఉన్నా గత పాలకులు ఎందుకు పూర్తి చేయలేదో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ కల్వర్టుల వద్ద ఇప్పటివరకు చాలా మంది ప్రమాదాలకు గురై కాళ్లు, చేతులు విరిగిపోయి, కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయారు. ఒక దశలో ఈ రహదారిపై నుంచి ప్రతినిత్యం హైదరాబాద్‌లోని వివిధ ఆర్టీసీ డిపోలకు చెందిన సిటీ బస్సులు సైతం కల్వర్టు వద్ద ఏర్పడ్డ పెద్ద పెద్ద గొయ్యిల కారణంగా రద్దు అయిన ఘటనలున్నాయి.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పనులకు మోక్షం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఈ మిగిలిపోయిన పనులను కాంట్రాక్టర్లు అప్పట్లోనే పూర్తి చేసి ఉంటే రూ.1.69 లక్షల నిధులు సరిపడేవి. కానీ అప్పట్లో 5 శాతం ఉన్న వ్యాట్ నేడు 18 శాతం వరకు పెరగడంతో చంద్రధన గ్రామం సమీపంలోని కమాన్ వద్ద, నల్లచెరువు వద్ద కొద్ది మేర పనులు మిగిలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మిగిలిపోయిన పనులకు కూడా పూర్తి చేయడానికి మరో రూ.60 లక్షల నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సూచన మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఏది ఏమైనా 10 సంవత్సరాల నుంచి ఈ రహదారిపై ప్రయాణించే ప్రతి వాహన చోదకుడు నరకం చూశారు. కానీ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మూడు నెలల క్రితం సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ లు ఏర్పాటు చేసి ఆ మిగిలిపోయిన పనులను త్వరలో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ పనులన్నీ గత నెల రోజులుగా చురుకుగా కొనసాగి నేటికీ ఒక కార్యరూపం దాల్చడంతో ప్రజలు వాహన చోదకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Similar News