కల్తీ పాలకు అడ్డా.. ఏడాదిలో రెండుసార్లు అధికారుల నోటీసులు
నకిలీ పాల పదార్థాల తయారీ కేంద్రంగా పెద్ద అంబర్ పేట
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : నకిలీ పాల పదార్థాల తయారీ కేంద్రంగా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ మారుతున్నది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికారులు కూడా పలు మార్లు తనిఖీలు చేసి వార్నింగ్‌లు ఇచ్చి నా సదరు కంపెనీ యజమానులు తీరు మార్చుకోవడం లేదు. ఏడాది కాలంలో ఒకే కంపెనీపై రెండు సార్లు తనిఖీలు నిర్వహించిన ప్పటికీ అధికారులే తప్పు గా వ్యవహరిస్తున్నారంటూ సదరు యాజమాన్యం, సిబ్బంది చేస్తున్న ఆరోపణలతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమముల గ్రామ శివారులో ఉన్న పాలు, పాల పదార్థాల కంపెనీలో రాష్ట్ర స్థాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడాదిలో రెండుసార్లు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత వాతావరణంతో పాటు నాణ్యతలేని పాల పదార్థాలు తయారు చేస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో అధికారులు శాంపిళ్లు సేకరించి ఉన్నతాధికారుల కి పంపించి రిపోర్టు తీసుకున్నారు. అయినా సదరు పాల కంపెనీ యాజమాన్యం తీరులో మాత్రం మార్పు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సదరు యాజమాన్యం కుటుంబ సభ్యులు పాడి పరిశ్రమలో ఉన్నత రైతులుగా పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం నిర్వహణ చేసిన యజమానులు ఆ పేరును పోగొట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాల పదార్థాలను తయారు చేయడంలో నాణ్యత పూర్తిగా కొరవడుతున్నదని, సదరు పాల కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలోనే పలువురు ఫిర్యాదులు చేశారు.
గోప్యంగా శాంపిల్స్ రిపోర్ట్..
పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి శాంపిళ్లను పంపించారు. కానీ రిపోర్టు ఏ విధంగా ఉందో ఇంకా బహిరంగంగా అధికారులు వెల్లడించలేదు. రిపోర్టు ఇంకా రాలేదా? వచ్చినా కూడా బహిరంగంగా వెల్లడించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాల్సి ఉంది. దాడులు చేసిన విషయాలను ఫొటోలతో సహా ఎక్స్‌లో పోస్ట్ చేసినప్పటికీ దానికి సంబంధించిన పరిణామాల పూర్తి వివరాలు మాత్రం సంబంధిత అధికారులు వెల్లడించడంలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పాల కంపెనీపై నాణ్యత లే కుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాడులతో పాటు నాణ్యత పరమైన విషయాలను తెలుసుకునేందుకు ‘దిశ’ సదరు పాల కంపెనీ యజమానులను వివరణ కోరేందుకు పలు మార్లు సంప్రదించినా వారు అందుబాటులోకి రాలేదు.