పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు బడ్జెట్ కేటాయింపు జరిగేనా..?
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి రంగారెడ్డి

దిశ,రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి : గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలోని అనేక సాగునీటి ప్రాజెక్ట్ లు మరుగున పడ్డ విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రముఖమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ ల డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా గత పాలగుల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం జరిగింది అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్న నేపథ్యంలో కనీసం ఈ ప్రభుత్వం అయినా ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ లను పట్టించుకోని, వాటిని పున ప్రారంభించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుందా..? లేదా..? అని ఉమ్మడి జిల్లాల రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఎండలు మండుతుండడంతో సాగునీరు, తాగునీరు కోసం అల్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ లు మధ్యలోనే ఆగిపోవడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాస్త కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మారడంతో ఉమ్మడి జిల్లాలలో ఒక్కటంటే ఒక్క పారే సాగునీటి కాలువ అనేదే కంపించడం లేదు. ఇదిలా ఉంటే కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతం రైతులు అందరు వర్షం మీదనే ఆధారపడుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ మధ్య సరైన వర్షపాతం లేక పంటలు ఎండిపోతుంటే, ఒక్కోసారి ఊహించని రీతిలో తుపానులు, వరదలు వచ్చి పండిన పంటలు కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. దీంతో చేసేది లేక చేసిన అప్పులు తీరక అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏడాదిలో కనీసం రెండు పంటల మాట అటుంచి ఒక్క పంట కూడా పండించలేని దుర్భర స్థితిలో ఉమ్మడి జిల్లాల రైతులు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలపై వరాల జల్లు కురుసేనా..?
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్ట్ లే కాక, అభివృద్ధిలో కూడా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వెనకబడిందనే చెప్పాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో తప్ప అభివృద్ధి అనేది జరగలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు అభివృద్ధిలో వెనకకు నెట్టివేయబడ్డాయి అని గుర్తు చేశాడు. అందుకనే ఈ రెండు ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా ఫోర్త్ సిటీ అభివృద్ధి కోసం కూడా భారీ నిధుల కేటాయించే అవకాశం ఉంది. దీంతో నేడు ప్రవేశపెట్టే బడ్జెట్ పట్ల ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.