రన్నింగ్ కారులో ఎగిసిపడిన మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్..
నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, శంషాబాద్ : నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహదీపట్నం వైపు నుండి క్వాలిస్ కారులో డ్రైవర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే పై ఆరాం ఘర్ వైపు వస్తున్నాడు. సరిగ్గా పిల్లర్ నెంబర్ వన్ 151 వద్దకు రాగానే ఫ్లై ఓవర్ పై క్వాలిస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన డ్రైవర్ హుటాహుటిన కారులో నుంచి దిగి ప్రాణాలను కాపాడుకున్నాడు. డ్రైవర్ చూస్తుండగానే కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేసింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంజన్ ఓవర్ హీట్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.