తాండూరు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను టార్గెట్ రూ.13 కోట్లు
ప్రతి ఏటా మార్చి నెలాఖరు వరకు చేపట్టే ఇంటి పన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

దిశ, తాండూరు : ప్రతి ఏటా మార్చి నెలాఖరు వరకు చేపట్టే ఇంటి పన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాండూరు మున్సిపల్ 2025-26 సంవత్సరానికి చెందిన ఆస్తి, నల్లా, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, చెత్త సేవ (యూజర్ చార్జీలు) వంటి తదితర పన్నులను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్నుల బకాయిలు ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. ఓ ఫంక్షన్ హాల్ ఆస్తి పన్ను చెల్లింపు కోసం మున్సిపల్ అధికారులకు రూ.6 లక్షల చెక్కు ఇచ్చారు. ఇది బౌన్స్ అయ్యింది. అయినా ఆ ఫంక్షన్ హాల్ యజమాని పై అధికారులు చర్యలు తీసుకోలేదు.
రాష్ట్ర స్థాయికి చెందిన ఓ నేత కాలేజీ ఆస్తిపన్ను సుమారు రూ.6 లక్షలు బకాయిన్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత, ప్రస్తుతం తాండూరు ప్రజా ప్రతినిధి కూడా కొన్ని లక్షల బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యధిక బకాయిల జాబితాలో ఉన్న నేతలను మున్సిపల్ అధికారులు పన్ను కట్టించే ధైర్యం చేయలేకపోతున్నారన్న విమర్శలు చేస్తున్నారు. సామాన్యులపై మున్సిపాలిటీ అధికారులు శివతాండవం ఆపి.. బడా నేతలు, లక్షల్లో పాత బకాయిల జాబితాలో పేర్లున్న వారిపై చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పాత బకాయిల పరిస్థితి ఏంటి..?
తాండూరు మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు, 14,707 ఆవాసాలున్నాయి. ఏటా ఆస్తి పన్ను రూపంలో మున్సిపాలిటీకీ రూ.13.04 కోట్ల ఆదాయం చేకూరుతుంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.13.04 కోట్లు వసూలు చేయాల్సిన అధికారులు.. నిర్లక్ష్యం కారణంగా రూ.1.58 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయగా.. ఇంకా రూ. 11.02 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శలు వస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం పాత పెండింగ్ పన్ను బకాయిలు కూడా వసూలు చేయాలని పన్నులు చెల్లించిన వారు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్కొక్కరికి లక్షల్లో పెండింగ్ బకాయిలు..
పెండింగ్ బకాయిల్లో ఎక్కువ శాతం ఆస్తి పన్నులు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు, ఫంక్షన్ హాల్స్, విద్యా సంస్థల యజమానులున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు నీటి పన్నులు, పలు భారీ వాణిజ్య భవనాలు కూడా ఒక్కొక్కరివి లక్షల్లో పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి. తాండూరులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. మున్సిపాలిటీలో కొన్ని కోట్ల రూపాయల పన్నులు పేరుకపోయాయి. పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లు చేయకుండా ఆదాయం వచ్చే పనుల్లో నిమగ్నమయ్యారనే ఆరోపణలు లేకపోలేదు. గత ఏడాది రూ.11.04 కోట్లు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఆయా మున్సిపాలిటీల పరిధిలో వందల మంది సచివాలయ సిబ్బంది ఉన్నప్పటికీ ఇంటి, నీటి పన్నులు సైతం కొన్ని కోట్లలో పేరుకుపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
పేదలకో న్యాయం.. పెద్దలకో ధర్మం..!
పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక ధర్మం ఎలా ఉంటుందో తాండూరు మున్సిపాలిటీ అధికారులు స్పష్టంగా చూపించారంతే. తాండూరులో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపాలిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మార్చి దగ్గర పడుతుందని ఊదరగొడుతూ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తూ పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టిన మున్సిపాలిటీ అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పడ్డ పెద్దల జోలికి వెళ్లలేదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రూ.లక్షల్లో ఆస్తిపన్నులు బకాయిలున్నా వాళ్ల వద్దకు వెళ్లి అడగలేని పరిస్థితి నెలకొంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే కేవలం మధ్య తరగతి కుటుంబాలు, నిరుపేదలు, సమాజంలో గౌరవం కోసం బతికేవాళ్లనే లక్ష్యంగా చేసుకొని పన్నులు వసూలు చేశారే తప్ప పెద్దమనుషులుగా, అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్లు రూ.లక్షల్లో బకాయి పడ్డ పట్టించుకోలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11.04 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాకుండా ( పెండింగ్ ఆస్తి పన్ను ) స్తంభించిపోయింది.
మున్సిపాలిటీల అభివృద్ధి పై ప్రభావం..
పన్ను వసూళ్లలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కడికక్కడ పలు అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో చేయడం లేదు. బడా నేతలు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాల్స్, భారీ వాణిజ్య, వ్యాపారాల భవనాల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కోట్ల రూపాయల్లో పెరిగిపోవడంతో పురపాలక సంఘాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. తాండూరు మున్సిపాలిటీకి రూ.11.04 కోట్ల మేర పన్ను బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి అర్థమవుతున్నది. బడా నేతల ఆస్తిపన్ను పెండింగ్‌లో ఉండడంతో మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్న కలవరం మరింత రేపుతోంది.