ఔటర్​ హద్దు వరకు అర్బన్​ ప్రాంతాలే

రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఔటర్​ రింగ్ రోడ్డులోని గ్రామాలు, మున్సిపాలిటీలను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని భావించింది.

Update: 2024-09-03 14:47 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఔటర్​ రింగ్ రోడ్డులోని గ్రామాలు, మున్సిపాలిటీలను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని భావించింది. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలిటీల్లోనే మరిన్ని గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్​ను అధికారికంగా ప్రకటించింది. ఔటర్​ రింగ్ రోడ్డు హద్దుగా అర్బన్​ ప్రాంతంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమైతుంది. ఇప్పటి వరకు ఔటర్​కు అటు ఇటుగా ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలను సైతం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అర్బన్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

జీహెచ్​ఎంసీకి ఫుల్​స్టాఫ్​...

ఔటర్​ రింగ్​ రోడ్డు లోపలున్న గ్రామాలన్నీ జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్​ఎంసీలో మున్సిపాలిటీ ప్రక్రియపై మంత్రివర్గ ఉపసంఘం వేసింది. దీంతో ఆ ప్రక్రియ ఆలస్యంకానున్నట్లు తెలియడంతో ముందుగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసి, ఆ తర్వాత జీహెచ్ఎంసీలో విలీనంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఒకే సారి పంచాయతీలను జీహెచ్​ఎంసీలో విలీనం చేయడం చట్టవ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కనుక మొదటగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసిన తర్వాతే జీహెచ్​ఎంసీ ఆలోచన ఉండే అవకాశం కనిపిస్తోంది. సుమారుగా ఐదేండ్లు విలీనం చేసిన మున్సిపాలిటీగా కొనసాగిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

విలీన గ్రామాలు ఇవే...

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్​, పెద్ద అంబర్​పేట్​, నార్సింగ్​, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో 12 గ్రామాలను విలీనం చేశారు. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్​, తారామతిపేట గ్రామ పంచాయతీలను పెద్ద అంబర్​పేట్​లో... బహుదూర్​గూడ, పెద్దగోల్కోండ, చిన్న గోల్కోండ, హమ్మిదుల్లానగర్​, రషీద్​గూడ, గ్యాంసీమయగూడ గ్రామ పంచాయతీలు శంషాబాద్​లో... మిర్జాగూడ గ్రామ పంచాయతీ నార్సింగ్​లో... హర్షగూడ గ్రామ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలల్లో విలీనమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్​ విడుదల చేసింది.

ఐదేండ్లు కొనసాగాల్సిందే...

మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేయడంతో జీహెచ్​ఎంసీలో విలీనం అసాధ్యం. శంషాబాద్​, పెద్ద అంబర్​పేట్​, నార్సింగ్​, తుక్కుగూడ మున్సిపాలిటీలు యధావిధిగానే మరో ఐదేండ్లు కొనసాగే అవకాశం ఉంది. మున్సిపాలిటీ యాక్ట్​ ప్రకారం పంచాయతీలు మున్సిపాలిటీగా మారినప్పుడు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే మున్సిపాలిటీగా పరిపాలన కొనసాగిన తర్వాతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ పంచాయతీలు మున్సిపాలిటీలో చేరిన వ్యవధిలో జీహెచ్​ఎంసీగా ఏర్పాటుకు కొత్త చిక్కలు వచ్చే అవకాశం ఉంది. 

Tags:    

Similar News