వింత వ్యాధితో 4 వేల కోళ్లు మృతి

వింత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాయిలర్ కోళ్లు మృత్యువాత పడడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Update: 2024-12-26 15:01 GMT

దిశ, యాచారం : వింత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాయిలర్ కోళ్లు మృత్యువాత పడడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలోని చౌదర్ పల్లి, గ్రామానికి చెందిన జంగయ్య, షెడ్డులోని కోళ్లకు వింత వ్యాధి సోకడంతో 3 వారాల క్రితం 4వేలకు పైగా బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. అప్పటినుండి రోజు 50 నుండి 60 కోళ్లు చనిపోతుండడంతో రెండు లక్షల 50 వేలకు పైగానే నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. మంచాలకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి బాయిలర్‌ కోళ్లషెడ్డులో ఒక్కరోజే 650 కోళ్లు మరణించాయి. యాచారం, చౌదర్‌పల్లి, కుర్మిద్ద, చిన్నతూండ్ల, మాల్‌, తమ్మలోనిగూడ, గ్రామాలలోని కోళ్లఫారాలలో బాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతోపాటు సీఆర్బి, వివెండ్, వ్యాధులు సోకుతుండడంతో కోళ్లు ఆరోగ్యంగానే కనిసిస్తున్నా ఒక్కసారిగా షెడ్లలోని కోళ్లు మొత్తం చనిపోతుండడంతో రైతుల దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. వేసవిలో కాకుండా చలికాలంలో కోళ్లు చనిపోతుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కోడిపిల్లలను పంపిణీ చేసే కంపెనీలు 20 ఏళ్లుగా ఒక కేజీకి 3 రూపాయలే చెల్లిస్తున్నాయని 6 రూపాయలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.

వ్యాక్సిన్ తో కోళ్లను కాపాడుకోవచ్చు : మండల పశు వైద్యాధికారి రేఖ,

షెడ్లలోని బాయిలర్ కోళ్లు చనిపోతుండడం తమ దృష్టికి రాలేదని తెలిపారు. రైతులు తమను సంప్రదిస్తే సమస్య తీవ్రతను బట్టి కోళ్లకు వ్యాక్సిన్లు ఇస్తామని సూచించారు.


Similar News