సీఎం అనాలోచిత చర్య వల్లే రైతులకు ఈ గతి పట్టింది : సబితా రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్య వల్లే లగచర్లలో దాడి జరిగి రైతులకు ఈ గది పట్టిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు
దిశ, పరిగి : సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్య వల్లే లగచర్లలో దాడి జరిగి రైతులకు ఈ గది పట్టిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లగచర్ల దాడిలో నిందితులుగా పరిగి సబ్ జైల్లో ఉన్న వారిని గురువారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి, హరిప్రియ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా తో మాట్లాడుతూ… తమ భూములు పోకుండా సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని, అనుకుంటే ఇలా ఫార్మా కాలుష్య కారణాలతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులు భూములు ఇవ్వాలని తెలిసి కూడా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కలెక్టర్, అధికారులను పంపించి సీఎం అనాలోచిత చర్య వల్లే దాడి జరిగి రైతులు, అధికారులు బాధ పడుతున్నారన్నారు. సంబంధం లేని వారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారన్నారు.
మొత్తం 55 మంది అదుపులోకి తీసుకొని కేవలం టీఆరెస్స్ కు చెందిన వారిని మాత్రమే రిమాండుకు తరలించారని తప్పు పట్టారు. తమ పార్టీకి చెందని ఇతరులను వదిలేశారన్నారు. టీఆరెస్స్ పార్టీని బదనాం చేయలనే నెపంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నాటకం అవుతుందన్నారు. భరోసా కల్పించాల్సింది పోయి భూసేకరణ ను డైవర్ట్ చేస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. గతంలో కేసీఆర్ ఫార్మా సిటీ కోసం 15 వేల ఎకరాలు భూసేకరణ చేశారని తెలిపారు. అప్పుడు ఫార్మా సిటీకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారన్నారు. దాడికి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా ఇరికించారన్నారు. ఏదోవిధంగా కేటీఆర్ ను కూడా ఇందులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు.
నాలుగు సార్లు ఇప్పటికే ప్రయత్నించి విఫలమయ్యారని, గతంలో తను జైలుకు వెళ్ళానని ఇప్పుడు వీళ్ళను పంపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారు. ఎంతమందిని జైలుకు పంపినా ,ఎంతమందిని ఇబ్బంది పెట్టినా బీఆరెస్స్ పార్టీ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తుందని, వారికి అండగా నిలుస్తుంది అన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ వాతావరణాన్ని రేవంత్ రెడ్డి అల్లకల్లోలంచేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నాడు భూసేకరణ చేసేటప్పుడు రైతులతో మాట్లాడి ఒప్పించి తీసుకోవాలన్నారు. పేద రైతుల పక్షాన బీఆరెస్స్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.