బలహీన వర్గాల లెక్కలు తెలిస్తే అభివృద్ధికి అవకాశం
సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో: సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనుకబాటుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు, వ్యక్తులు ,సంస్థలతో విజ్ఞాపనాలను స్వీకరించిన అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకొని వారి హక్కుల రక్షణ కోసం కృషి చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తున్నదని, ఇప్పటివరకు 7 విచారణలు పూర్తి చేయగా, ఇది 8 వ విచారణ అని తెలిపారు.
ఈ నెల 26 వరకు కమిషన్ బహిరంగ విచారణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని చెప్పారు. బీసీ హక్కుల పరిరక్షణ కోసం బీసీ కమిషన్ పనిచేస్తుందని, ఈ విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తుందని, బీసీలపై ఎక్కడైనా దాడులు జరిగినట్లయితే చర్య తీసుకునెందుకైనా బీసీ కమిషన్ వెనకాడదని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయం అని, దీనివల్ల రాష్ట్రంలో జనాభాలో బిసి లు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కోటి 15 లక్షల పైచిలుకు కుటుంబాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించడం జరిగిందని, ఇందులో 87,000 మంది ఎన్యుమరేటర్లు ఇప్పటివరకు ఇండ్లకు వెళ్లి సమాచారాన్ని సేకరిస్తున్నారని, సమగ్ర కుటుంబ సర్వే వివరాలు పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరుగుతుందని చెప్పారు. అయితే ఈ సర్వేపై కొందరు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, సమాజంలో వెనుకబడి, బలహీనంగా ఉన్న వారు ఎంత మందో తెలిస్తే మంచి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సమాజంలో బలహీనంగా ఉన్న వారి అభివృద్ధి కోరుకునే వారికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇప్పటివరకు 65 నుంచి 70% సర్వే పూర్తయిందని, రంగారెడ్డి జిల్లాలో 79.6%, మేడ్చల్ మల్కాజ్ గిరి 65.3%, వికారాబాద్ 74.5% సర్వే పూర్తి చేయడం పట్ల ఆయన అభినందించారు. అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలో సైతం సర్వే బాగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లాల యంత్రంగాలను అభినందించారు. గురువారం నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా విశ్వకర్మ ,బ్రాహ్మణ, పూసల, రజక, కుమ్మర, కమ్మరి ,ఉప్పర అన్ని కుల సంఘాలు, ఇతర సంఘాల వారు వచ్చి వారి బాధలను, వారి కోరికలను విన్నవించుకున్నారని అన్నారు. ఈ బహిరంగ చర్చలో 72 పిటిషన్లు అందాయని తెలిపారు. రెండు సంవత్సరాల తొమ్మిది నెలల కాల పరిమితిలో బీసీ కమిషన్ బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
బీసీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ తొలగించాలని, ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, కుమ్మరులకు చెరువు మట్టిని ఉచితంగా ఇవ్వాలని, ముదిరాజులు, కుమ్మరి, బట్రాజ్ తదితర కులాలను బీసీ డీ నుండి ఏ కి మార్చాలని, రజకులను ఎస్సీలుగా గుర్తించాలని, పిచ్చకుంట్లను పూర్తిగా ఆ పేరు పిలవడం మానేసి వంశ రాజ్ గా మాత్రమే పిలవాలని విజ్ఞాపనలు వచ్చాయని వాటన్నిటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని, బిసి కమిషన్ పై ఎలాంటి అపనమ్మకం అవసరం లేదని ఆయన తెలిపారు. ఉదయం బహిరంగ విచారణ ప్రారంభానికి ముందు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ… బీసీ కమిషన్ బహిరంగ విచారణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ప్రత్యేకించి మెడికల్ పాయింట్, రిజిస్ట్రేషన్ సెంటర్, అఫిడవిట్ ఏర్పాటు చేయడంతో పాటు, జిరాక్స్ ,అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
తన స్వాగతోపన్యాసం లో బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ… బీసీలకు అన్యాయం జరగరాదన్నదే బీసీ కమిషన్ బాధ్యత, ఈ బాధ్యత నెరవేర్చడానికి తాము ఎంతైనా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు సమగ్ర కుటుంబ సర్వే పట్ల ఉన్న అపోహలను విడనాడి ఎన్యుమరేటర్లు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. బీసీలలో ప్రస్తుతం చైతన్యం పెరిగిందని, సమాజంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని ,దీంతో బీసీలకు మేలు చేసేందుకు అవకాశం ఉందని, ఈ విషయంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్, డి ఆర్ డి ఓ శ్రీలత, రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారులు,వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.