రైతుల కంట కన్నీరు తెప్పించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు

రైతుల కంట కన్నీరు తెప్పించిన,ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Update: 2024-11-21 11:03 GMT

దిశ బొంరాస్ పేట్ :- రైతుల కంట కన్నీరు తెప్పించిన,ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం దుద్యాల మండలంలోని రోటిబండా తండా,లగచర్ల,పుల్చర్ల కుంట తండాలలో,10 కమ్యూనిస్టు పార్టీల బృందంతో కలిసి, పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”కొడంగల్ లో 1156 ఎకరాల్లో సీలింగ్ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో పెట్టొచ్చు కదా” అని సూచించారు. బాధితులు నిరసన తెలపడం వాళ్ళ హక్కు,చట్టానికి విరుద్ధంగా భూములు తీసుకుంటే బాధితులకు అండగా ఎర్రజెండలు ఉంటాయన్నారు. రైతులు చేస్తున్న దానికి రాజకీయ రంగు పులమడం తగదన్నారు.

కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి ఆ నీళ్ళు రైతులకా, ఫార్మా కంపెనీలకా అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీ లతోపాటు, ఏడవ గ్యారెంటీగా స్వేచ్ఛ కలిగిస్తానని చెప్పి, మేము లగచర్ల రావడానికి 15 పోలీస్ (స్టేజీలను) బృందాలను దాటుకుంటూ రావడానికి ఇది ఉగ్రవాద ప్రాంతమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల భాషలు దౌర్భాగ్యంగా ఉన్నాయన్నారు. వెంటనే ఫార్మా నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి లేనియెడల బాధితుల తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఫార్మా బాధితులు చావడానికి అయినా సిద్ధం కానీ,మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయనతో ఆవేదన వ్యక్తం చేశారు. తావు ఇడిస్తే, చావు వస్తుందని బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు.


Similar News