బరితెగించిన కబ్జాదారులు..?
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

దిశ, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డుకునేవారు, అడిగేవారు లేకపోవడంతో తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మణికొండ మున్సిపల్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని హై టెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించి ఏర్పాటుచేసిన ఓ రేకుల ప్రహరీని ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. హై టెన్షన్ కరెంటు తీగల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదనే నిబంధన అతిక్రమించడమే కాకుండా చారిత్రాత్మక ముల్కాపూర్ నాళాను సైతం ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుపుతున్నారు. ఇలా స్థానికులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకున్నారు.
మణికొండ మర్రిచెట్టు సమీపంలో ఓ సంస్థ నాలాలో కలిపేసుకుని హై టెన్షన్ విద్యుత్ తీగల కింద నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అవ్వడంతో..రేకుల ప్రహరీని హైడ్రా తొలగించింది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్ పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతల బస్తీల మీదుగా హుస్సేన్ సాగర్ కు వర్షపు నీరును తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా పునరుద్ధరణతో.. చాలా ప్రాంతాలకు భూగర్భ జలాలు పెంచినట్లు అవుతుందని దానికి హైడ్రాను కోరారు. అలాగే హుస్సేన్ సాగర్ కు వర్షపు నీరు తీసుకువచ్చే ఏకైకనాల ఈ బుల్కాపూర్ నాలా అని స్థానికులు తెలుపుతున్నారు.
కూల్చి వేసిన రెండు రోజులకే పరదా..!
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణంగా గుర్తించి కూల్చి వేసింది. దీంతో సదరు నిర్మాణ సంస్థ నిర్మాణాన్ని ఆపకుండా తిరిగి పరదాలు కట్టి ఐరంజల్స్ అడ్డుపెట్టి సీట్లు అడ్డుపెట్టి బిల్డర్ మూసివేసినట్లు స్థానికంగా ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు అంటున్నారు. నిర్మాణ సంస్థ కూల్చివేతలు నిలిపివేసినప్పటికీ తిరిగి ఎలా నిర్మాణాలు చేపడతారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకొని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మెతక వైఖరితో అధికారులు...
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో బుల్కాపూర్ నాలా విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా బల్కాపూర్ నాలాలో కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలలో హైడ్రా కూల్చివేసిన నిర్మాణాదారుడు తిరిగి పరదాలు కట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే నిర్లక్ష్యపు సమాధానాలతో దాటవేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 10 కోట్లతో రోడ్డు సైతం వేసిందని, ఆ విషయాన్ని సైతం అధికారులు మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రూ.10 కోట్లతో నిర్మించిన రోడ్డు నిర్మాణదారుడు మూసి వేయడం పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అధికారులతో మాట్లాడెందుకు ప్రయత్నిస్తే కుర్చి వేసుకుని ఇక్కడే కూర్చోవాలా.. మాకేం పనులు ఉండవా.. ఒత్తిళ్లు వస్తున్నాయని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.