సమగ్ర కుటుంబ సర్వేకు స్పందన అంతంతమాత్రమే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వస్తున్నది.

Update: 2024-11-10 02:23 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో / దిశ, ప్రతినిధి వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కొంత అందుబాటులో ఉన్నప్పటికీ, రూరల్ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పొలం పనుల్లో బిజీ బిజీగా ఉండడంతో ఎన్యుమరేటర్లు ఇంటికి వెళ్లి చూడగా ఎవరు ఉండకపోవడంతో సర్వే చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అంటున్నారు. సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అది సాధ్యం కావడం లేదు. కొన్ని మండలాల్లో ఇప్పటికీ స్టిక్కరింగ్ వేయడం పూర్తి కాకపోవడంతో సర్వే ఎప్పుడు మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. స్టిక్కరింగ్ ఆధారంగానే ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని సర్వే రిపోర్ట్ లు పంపించాలి అనేది డిసైడ్ చేస్తారని, అది పూర్తయ్యాక గ్రామ పంచాయతీలకు సర్వే రిపోర్టులు అందుతాయని అధికారులు వెల్లడించారు.

76 ప్రశ్నలతో కూడిన సుదీర్ఘ రిపోర్టులో ఎన్యుమరేటర్లు సరైన సమాధానాలు రాబట్టడం కొంత కష్టతరంగానే కనిపిస్తుంది. వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కుల, గోధుమగూడ లాంటి వివిధ గ్రామాల్లో, వికారాబాద్ మున్సిపల్ లోని వివిధ వార్డులలో శనివారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధార్ వివరాలు, కులంకు సంబంధించిన వివరాలు అన్ని చెప్తున్నప్పటికీ, కొందరు వారు పొందుతున్న సబ్సిడీల వివరాలు చెప్పడానికి జంకుతున్నారు. మరి ముఖ్యంగా కొందరికి రేషన్ కార్డు పొందే అర్హత లేకపోయినా చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అలాంటివారు రేషన్ కార్డు ఉంది అనే వివరాలు చెప్తే మళ్లీ రేషన్ కార్డు ఎక్కడ కట్ అవుతుందేమోనని భయపడి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. అలాగే స్థిర చర ఆస్తుల వివరాలు, లోన్ల వివరాలు చెబితే ఎక్కడ సమస్యలు వస్తాయో అని గోప్యత వహిస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా తమ

రాజకీయ అనుభవం చెప్పడానికి భయపడుతున్నారు. రాజకీయ అనుభవం ఎక్కువగా ఉంది అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తారో లేదో అనే భయంతో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు.

ఎన్యుమరేటర్ల బాధలు వర్ణనాతీతం..

అర్బన్ ప్రాంతాలలో సర్వే కొంత వరకు కొనసాగుతున్నప్పటికీ రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతాలలో వరి కోతలు, పత్తి ఏరడం, ఇతర పొలం పనులు ఉండడంతో రైతులు ఉదయం 9 గంటలలోపే పంట పొలాలకు వెళ్లి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తున్నారు. దీంతో ఎన్యుమరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలు సేకరించడానికి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో మా బాధలు వర్ణనాతీతం అయ్యాయి అని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని ఉదయం లేచి గ్రామాలకు వెళ్తే ఎవరూ ఉండడం లేదు. ఇలా అయితే సర్వే సజావుగా సాగే పరిస్థితి లేదని, ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. స్టికరింగ్ సమయంలో కూడా కుటుంబ సభ్యులు లేకపోవడంతో అనేక ఇబ్బంది ఎదుర్కున్నామని చెప్తున్నారు. దీని కారణంగానే రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి, బంట్వరం, పెద్దేముల్ లాంటి మండలాలలో శనివారం సాయంత్రం వరకు స్టిక్కరింగ్ అంటించడం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి మండలాలలో సోమవారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సర్వే కోసం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాము : మోత్కుపల్లి గ్రామవాసి నాలాపురం సంగయ్య

నా పేరు నాలపురం సంగయ్య మా స్వగ్రామం వికారాబాద్ జిల్లా, కోట్ పల్లి మండలం, మోత్కుపల్లి గ్రామం. వృత్తిరిత్యా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. మా గ్రామస్తులు శనివారం రోజు సమగ్ర కుటుంబ సర్వే ఉందని చెప్పడంతో స్వగ్రామానికి వచ్చాను. కానీ మా గ్రామంలో ఇంకా సర్వే ప్రారంభం కాలేదు. కేవలం ఇంటికి స్టిక్కర్ అతికించి వెళ్లారు. సర్వే ఎప్పుడు చేస్తామో మళ్ళీ వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పనిచేసే సంస్థ సెలవులు ఇవ్వని పరిస్థితుల్లో సర్వే కోసం మళ్లీ మళ్లీ గ్రామానికి రావాలి అంటే ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. ఈ విషయం పట్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

సమగ్ర కుటుంబ సర్వే ప్రశాంతంగా కొనసాగుతుంది : వికారాబాద్ మండలం ఎంపీడీవో వినయ్ కుమార్

వికారాబాద్ మండలంలో ఉన్న 21 గ్రామాలలో శనివారం నుండి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయ్యింది. అన్ని గ్రామాలలో సర్వే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వికారాబాద్ మండల ఎంపీడీవో వినయ్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఎంత ఉపయోగపడుతుంది. ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ లబ్ధితో పాటు అన్ని కులాలకు సమన్యాయం చేకూరుతుందని అన్నారు. కావున సర్వేకు వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరూ సహకరించాలని చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల కోరారు.


Similar News