ఆదిభట్లలో అక్రమ నిర్మాణాలు..ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మండల పరిధిలోని ఆదిభట్ల మున్సిపల్‌లో టీసీఎస్ ఎదురుగా
దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని ఆదిభట్ల మున్సిపల్‌లో టీసీఎస్ ఎదురుగా నిర్మిస్తున్న అనుమతికి మించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఆదిభట్లలోని సర్వే నంబర్లు 72(పీ), 73(పీ), 74(పీ), 75(పీ),76(పీ) 77(పీ)లో ఉన్న శ్రీ మిత్ర వెంచర్, శ్రీ శ్రీ వెంచర్‌లోని దాదాపు 25 బిల్డింగ్స్, నూతనంగా నిర్మిస్తున్న 200 గజాల్లో ప్లాట్స్‌ను బిల్డింగ్ కట్టడాలకు జీ+2 పర్మిషన్ తీసుకున్నారు. కానీ జీ+3, 4, 5లను యథేచ్ఛగా చేపడుతున్నారు. 15 రోజుల క్రితం ఆదిభట్ల కౌన్సిలర్ కోరే కళమ్మ జంగయ్య ఈ అక్రమ కట్టడాల గురించి కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారి అబీబ్ ఉన్నిసా బేగం ఆధ్వర్యంలో రెండు బిల్డింగ్స్‌ను కూల్చివేశారు. అనుమతులు జీప్లస్ టూ తీసుకొని బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు రాగా, మరుసటి రోజు నామమాత్రపు కూల్చివేతలు చేస్తున్నారు.
వారం పది రోజుల తర్వాత బిల్డింగ్స్ నిర్మాణాలు యథావిధిగా సాగుతున్నాయి. ఇంతా జరుగుతున్నా అధికారులు తూతూ మంత్రంగా ఒకటి, రెండు బిల్డింగ్స్ కూల్చివేసి హడావిడి చేస్తున్నారు. దాదాపు అక్కడ ఇరవై ఐదుపైన జీప్లస్ టూ పర్మిషన్ తీసుకొని జీ ప్లస్ త్రీ, ఫోర్, ఫైవ్, పెంట్ హౌస్ కడుతున్నారు. కాగా బిల్డింగ్స్ ఓనర్స్ అందరూ ఒక అసోసియేషన్‌గా ఏర్పడి అందరూ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని యథేచ్ఛగా పరిమితికి మించి అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియనట్లుగా వ్యవరిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఒక బిల్డింగ్‌కు దాదాపు రూ.5 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అనుమతులకు మించి చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాల విషయంలో ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్, కమిషనర్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏదైనా ఒక ఇల్లు నిర్మించాలంటే ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఇదంతా పేదలకు మాత్రమే బడా బాబులు నిర్మించాలంటే రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు. లక్షల్లో చేతివాటం చూపితే ఎంతటి భవనాలను అయినా నిర్మించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ప్రతిరోజూ టీసీఎస్ ఎదుట రోడ్డుపై వస్తుంటారు.. వెళ్తుంటారు.. ఈ విషయమై అధికారులకు తెలియకుండా ఇంత జరుగుతుందా? అని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, దీనిపై మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వివరణ అడుగగా.. ఈ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని, ఈ విషయమై పరిశీలిస్తామని చెబుతున్నారు.