లక్షరూపాయలు ఎగొట్టడానికే కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి..
అరువుగా తీసుకున్న లక్ష రూపాయలు ఎగొట్టడానికి రమేష్ ఆడిన ఫేక్ కిడ్నాప్, హత్య డ్రామాను బాలాపూర్ పోలీసులు తెరదించారు.
దిశ, బడంగ్పేట్ : అరువుగా తీసుకున్న లక్ష రూపాయలు ఎగొట్టడానికి రమేష్ ఆడిన ఫేక్ కిడ్నాప్, హత్య డ్రామాను బాలాపూర్ పోలీసులు తెరదించారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీ ఉప్పుగూడ సాయిబాబానగర్‌కు చెందిన రమేష్ (40) వృత్తి రిత్యా లేబర్. అదే కాలనీకి చెందిన వృత్తి రిత్యా లేబర్ అయిన పెద్దయ్య వద్ద నుంచి మూడు సంవత్సరాల క్రితం లక్షరూపాయలను అరువుగా తీసుకున్నాడు. అరువుగా తీసుకున్న డబ్బులు పెద్దయ్య తిరిగి ఇవ్వాలని రమేష్ పై ఒత్తిడి చేయసాగాడు. దీంతో పెద్దయ్య కుటుంబం పై రమేష్ కక్ష్యపెంచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే ఎలాగైనా పెద్దయ్యను, అతని కొడుకుని పోలీసుకేసులో ఇరికిస్తే లక్షరూపాయలు ఎగొట్టవచ్చని పథకాన్ని రచించాడు.
ఈ నేపధ్యంలోనే మార్చి 28వ తేదీన సాయంత్రం సమయంలో రమేష్ ఆటోలో దేవతల గుట్ట సమీపంలోని ఆర్సీఐ మెయిన్ రోడ్ వద్ద దిగాడు. అక్కడ కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వైర్లతో ముందుగా కాళ్ళను గట్టిగా కట్టేసుకున్నాడు. అనంతరం చేతులు వెనకకు పెట్టుకుని ఒక చేతికి వైర్‌ను గట్టిగా, మరో చేతికి కాస్త లూస్‌గా కట్టుకున్నాడు. నోట్లో పెట్టీపెట్టనట్టు గుడ్డను పెట్టుకుని కింద పడి పెనుగులాడడం, గట్టిగా ములగడం ప్రారంభించాడు. అటుగా వచ్చిన అయోధ్యనగర్‌కు చెందిన కళ్యాణ్ బాలాపూర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతని కాళ్లకు, చేతులకు ఉన్న వైర్లను తొలగించారు. తనను పెద్దయ్య కుమారుడు సురేష్ పని ఇప్పిస్తానని ఇక్కడికి తీసుకువచ్చి వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదాడని, హత్య చేయబోయడాని రమేష్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన బాలాపూర్ పోలీసులకు రమేష్ ఫిర్యాదు లో పేర్కొన్న ప్రకారం సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటోలో రమేష్ ఒక్కడే దిగినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దయ్య కుమారుడు సురేష్ కాల్‌డాటా ఆధారంగా లోకేషన్ చెక్ చేయగా గుంటూరులో ఉన్నట్లు నిర్దారించారు. మరోసారి అతని విచారించగా గుంటూరులోనే ఉన్నట్లు సురేష్ చెప్పడంతో పోలీసులు తనదైన స్టైల్లో రమేష్‌ను విచారించారు. పెద్దయ్యకు లక్షరూపాయలు ఎగొట్టడానికే ఈ ఫేక్ కిడ్నాప్ హత్య డ్రామా పన్నానని పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గతంలో రమేష్ ఓ కిడ్నాప్ డ్రామా అడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను తప్పు దోవ పట్టించిన రమేష్ పై కఠిన చర్యలు తీసుకుంటామని బాలాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.