ఫోర్త్ సిటీపై గ్రామాల్లో రోజు రోజుకు పెరుగుతున్న క్రేజ్
ఆదర్శమైన నగరంగా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. పరిమితమైన విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆదర్శమైన నగరంగా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. పరిమితమైన విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ అభివృద్ధిని ప్రత్యేక బోర్డుతో సాధ్యమవుతుందని ఎఫ్‌సీడీఏ (ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్‌గా మున్సిఫల్ శాఖ, ఇండస్ట్రియల్ శాఖకు సంబంధించిన మంత్రులు, సభ్యులుగా చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్, ఇండస్ట్రియల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, మున్సిఫల్, ఈఎఫ్‌ఎస్‌టీ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు, రంగారెడ్డి కలెక్టర్, డీటీసీపీ హైదరాబాద్ అధికారులు, మెంబర్ కన్వీనర్ గా ఎఫ్‌సీడీఏ కమిషనర్‌తో కలిపి 12 మందితో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫ్యూచర్ సిటీతో ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని సమీప ప్రాంతాల్లోని ప్రజలు నమ్ముతున్నట్లు తెలుస్తున్నది. ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉన్న కొన్ని గ్రామాలను అందులో కలపకపోవడంపై స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి తమ గ్రామాలను కూడా చేర్చాలని కోరుతున్నారు. ఈ గ్రామాలను చేర్చుతారా? లేదా ? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రకటించిన గ్రామాల పరిధికి పరిమితమై అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫ్యూచర్ సిటీ ఏరియా 765.28 చదరపు కి.మీ.లు..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ ఏరియా 765.28 చదరపు కి.మీ ఉండనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏరియా అంతా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. ఫ్యూచర్ సిటీకి నాలుగు దిక్కుల హద్దులను నిర్ణయించుకున్నారు. తూర్పున నాగార్జున సాగర్ రహదారి, పడమర శ్రీశైలం రహదారి.. ఉత్తరం వైపు ఔటర్ రింగు రోడ్డు, దక్షిణం వైపు రీజినల్ రింగ్ రోడ్లను హద్దులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలైన కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కడ్తాల్, అమన్ గల్ లోని 56 గ్రామాలను కలిపి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ గా నామకరణం చేశారు. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోనున్న 36 గ్రామాలను తొలగించి ఫ్యూచర్ సిటీ లో కలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ 56 గ్రామాల పరిధిలోని విస్తీర్ణం మొత్తం 765.28 చదరపు కి.మీలు ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మిర్ఖాన్ పేట్లో అథారిటీ కార్యాలయం..
గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మాసిటీ ప్రాంతం లక్ష్యంగా అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాలను బట్టి ఈ ప్రాంతంలో ఫార్మాకు ప్రాధాన్యం లేదని తెలుస్తోంది. కాకపోతే అధికారికంగా ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పడం లేదు. ఆ ఫార్మా పేరుతోనే భూములు సేకరించారు. ఒకవేళ ఫార్మా రద్దు చేస్తే ప్రభుత్వం తిరిగి భూములను రైతులకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి లీగల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఫార్మా కంపెనీలు పెట్టేందుకు ప్రభుత్వం నిరాకరిస్తుంది.
కేవలం ఆ కంపెనీలు మెడికల్ పరికరాలను, మెడిసిన్ సరఫరా కోసం గోదాములు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంత ప్రజలకు హాని కలుగని కంపెనీలను మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం జోన్లుగా విభజించి ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ కార్యకలాపాలన్నీ నిర్వహించేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నది. త్వరలో మిర్ఖాన్ పేట్, బేగరికంచె ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
మా గ్రామాలను కలపండి..
కందుకూర్, కడ్తాల్, అమన్ గల్లు, యాచారం, మహేశ్వరం మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు కలిసి స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులకు విన్నవించారు. ఈ వినతి పత్రాల ఆధారంగా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. కానీ ప్రభుత్వం సరిహద్దుల ఆధారంగానే ఫ్యూచర్ సిటీకి వ్యూహ రచన చేసినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే డిమాండ్లకు అనుగుణంగా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో చేర్చుకుంటూపోతే అర్థముండదనే ఉద్దేశంతో పరిమితమైన పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఫ్యూచర్ సిటీ రోల్ మోడల్‌గా ఉండాలి. ప్రస్తుత సిటీల్లో ఇష్టమున్నట్లు నిర్మాణాలు, కంపెనీలు పెట్టినట్లుగా కాకుండా నిబంధనలకు లోబడి అధికారులు, ప్రజలు పనిచేయాల్సి ఉంటుంది. ఎట్టిపరిస్థితిలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అధికారులు ఇచ్చే అనుమతులు, నిర్మాణాలు చేపట్టే వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన అంక్షలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించినట్లు స్పష్టమైపోతున్నది. గ్రామాలను చేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతుంది.
ఫ్యూచర్ సిటీ లోని గ్రామాలు ఇవే...
మండలం ---- గ్రామాలు
అమన్ గల్ ---- కోనాపూర్, రామనుంతుల
ఇబ్రహీంపట్నం ---- కంప్పాపహాడ్, పోచారం, రామ్ రెడ్డి గూడ, తూలెకలాన్, తుర్కగూడ, వెలిమినేడు, ఎర్రకుంట, తడ్లకాల్వ
కడ్తాల్ ---- చెరికొండపట్టి కల్వకుర్తి, చెరుకొండపట్టి పడకల్, ఎక్రాజ్గూడ, కడ్తాల్, కర్కలపహాడ్, ముద్విన్
కందుకూర్ ---- దాసర్లపల్లి, అన్నోజిగూడ, దెబ్బడగూడ, గూడూర్, గుమ్మడవెల్లి, కందుకూర్, కొత్తూర్, గఫూర్ నగర్, లేముర్, మాదాపూర్, మీర్ఖాన్పేట్, మహ్మద్ ననగర్, ముచ్చర్ల, పంజాగూడ, రాచులూర్, సర్వరావులపల్లె, తిమ్మాయిపల్లి, తిమ్మాపూర్
మహేశ్వరం మోహబ్బతినగర్, తుమ్మలూర్
మంచాల ---- ఆగపల్లి, నోముల, మల్లికార్జునగూడ, చౌదరిపల్లి, గున్గల్, కొత్తపల్లి, కుర్మిద్ధ, మెడిపల్లి, మల్కాజిగూడ, మొగులవంపు, నక్కర్త, నానక్‌నగర్, నందివనపర్తి, నజ్ధిక్ సింగ్, తక్కెళ్లపల్లి, తాడిపర్తి, తులెకుర్ధు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి
Read More..
LRS: అస్తవ్యస్తంగా LRS దరఖాస్తుల పరిష్కారం.. పట్టించుకోని సర్కార్