దిశ ఎఫెక్ట్.. ప్రభుత్వ ఆస్పత్రి బిల్డింగ్ మార్పుకు అధికారుల చర్యలు

Update: 2024-09-02 11:21 GMT

దిశ, ఆమనగల్లు: కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు కూడలి అయిన ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తాత్కాలిక భవనం నుంచి.. ప్రజలకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండే భవనంలోకి మార్చేందుకు పరిశీలిస్తున్నామని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు అన్నారు. ఆగస్టు 31న దిశ దినపత్రికలో ఇరుకు గదుల్లో వైద్యం.. రెండు బెడ్స్ తో నడుస్తున్న ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి కథనానికి స్పందనగా సోమవారము డీఎంహెచ్ వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ వో గీత వైద్య సేవలు అందుతున్న తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరము డీఎంహెచ్వో మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని.. 10 నెలల్లో పూర్తిచేసి నూతన భవనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చడంతో పక్కనే ఉన్న తాత్కాలిక భవనంలో వైద్య సేవలు కొనసాగిస్తే రోగులు ఇబ్బందులకు గురి కారు అనే ఉద్దేశంతో తాత్కాలిక భవనంలో వైద్య సేవలు కొనసాగిస్తున్నామని అన్నారు. తప్పని పరిస్థితుల్లో ఇరుకు గదుల్లో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతినిత్యం సుమారుగా 300 ఓపీ సేవలు కొనసాగుతుండటంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులు ఇబ్బందులకు గురికాకుండా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండే తాత్కాలిక భవనంలోకి వైద్య సేవలను మార్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగరాజు, పరీక్షిత్, తిరుపతి రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News