హైడ్రా పేరుతో పేదల పొట్టకొడుతున్న ముఖ్యమంత్రి

హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పొట్ట కొడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2024-09-29 10:39 GMT

దిశ, శంషాబాద్ : హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పొట్ట కొడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ షాకోట్ లోని మూసీ నిర్వాసిత బాధితులను ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దన్నారు. అవసరమైతే మీ ఇళ్లను కూల్చకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమంతా కవచంలా నిలబడతామన్నారు. జేసీబీలు వస్తే మొదట మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్ల జోలికి రానివ్వమన్నారు. హైడ్రాతో ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, ఇక నుంచి ఎవరి ప్రాణం పోనివ్వకుండా తాము రక్షణ కవచంలా ఉంటామన్నారు.

    కాంగ్రెస్‌ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని ప్రశ్నించారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌, ఆయన సోదరుడి ఇళ్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చరని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ది ఆపన్న హస్తం కాదని.. భస్మాసుర హస్తమని, కాంగ్రెస్‌ పార్టీకి హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ అంటూ రేవంత్ చేసే చర్యలకు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా లోటు బడ్జెట్ పేరుతో కాలయాపన చేస్తూ, ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇదే మూసీ పక్కన 40 అంతస్తుల భారీ టవర్స్ కడుతుంటే వాటిని వదిలేసి పేదల ఇళ్లను కూల్చుతున్నారని పేర్కొన్నారు. పేదవారికి బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News