మదనపల్లి పాత తండాలో ఉద్రిక్తత.. పోలీసులను నిర్బంధించే ప్రయత్నం..

అసైన్డ్ భూములను ఆక్రమిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి వత్తాసు పలికేందుకు పోలీసులు వచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి పాత తండాలో జరిగింది.

Update: 2024-11-10 03:56 GMT

దిశ, శంషాబాద్ : అసైన్డ్ భూములను ఆక్రమిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి వత్తాసు పలికేందుకు పోలీసులు వచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి పాత తండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మండలం మదనపల్లి పాత తండాలోని సర్వే నెంబర్ 50/2.50/3.50.4.50/5.50/15 లో సుమారు 25 ఎకరాల భూమిని గ 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం కోడవత్ కుటుంబ సభ్యులకు కేటాయించి పాసుబుక్కులు మంజూరు చేసింది. మూడు తరాల పూర్వం నుండి ఆ గ్రామానికి చెందిన గిరిజనుల కుటుంబాలు ఆ భూమిని సాగుచేస్తున్నారు. వారి అవసరాల నిమిత్తం కొంత భూమిని నగరానికి చెందిన ఇక్బాల్ సింగ్ అనే వ్యక్తికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి గిరిజనులకు చెల్లించాల్సిన నగదు పూర్తిగా చెల్లించకపోవడంతో అతను భూమిని తన ఆధీనంలోకి తీసుకోలేదు. గిరిజనులు విక్రయించిన భూమిలో నుండి కొంత భాగం రోడ్డు పోగా మిగిలిన 8 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి ఖాళీగా ఉంది.

ఆ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ భర్త మోహన్ నాయక్ తనదంటూ తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆ భూమి చుట్టూ రేకులతో ప్రహరీ వేసి లోపల నిర్మాణాలకు తెర లేపాడు. ఆ భూమి పూర్వికుల నుండి తామే సాగు చేస్తున్నామని స్థానిక గిరిజన కుటుంబానికి చెందిన కోడవత్ నర్సింగ్, దేవిజా, రామచందర్ తో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో గిరిజన కుటుంబాలు కోర్టును ఆశ్రయించి వివాదాస్పద భూమిలోకి పోలీసులు ఇతరులు వెళ్లకుండా కోర్టు ద్వారా నాట్ టు ఎంటర్ పేడ్ ఆర్డర్ తీసుకువచ్చారు. అయినా పోలీసులు దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ భర్త మోహన్ నాయక్ కు మద్దతుగా శనివారం రాత్రి గిరిజనులను భూమిని ఖాళీ చేయాలంటూ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వారిని చదరగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో గిరిజనులు పోలీసుల పై తిరుగుబాటుకు దిగారు. ఈ భూమి పూర్వీకుల నుండి మేము సాగు చేస్తున్నామని మేము ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మీరు కబ్జాదారునికి కొమ్ము కాయడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ మీకు కనిపించడం లేదా అని వాగ్వాదానికి దిగారు. కాసేపు పోలీసులకు గిరిజనుల మధ్య తోపులాట చేసుకుంది. అక్కడికి వచ్చిన ఎస్ఐ భాస్కర్ తో పాటు పోలీసులను నిర్బంధించ ప్రయత్నం చేశారు.

పోలీసులకు గిరిజనులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో అప్పటికప్పుడు శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి, శంషాబాద్ తహశీల్దార్ రవీందర్ దత్ కలిసి అక్కడ చేరుకున్నారు. అనంతరం గిరిజనులను సముదాయించి రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

శంషాబాద్ తహశీల్దార్ రవీందర్ దత్ మాట్లాడుతూ శంషాబాద్ మండలం మదనపల్లి సర్వేనెంబర్ 50లో దాదాపు 500 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం గిరిజనులకు వ్యవసాయం చేసుకోవడానికి అసైన్డ్ చేసిందన్నారు. గతంలోనూ అసైన్డ్ భూములలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదు రావడంతో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా నిలిపివేశామన్నారు. ఈ భూముల్లో ఎవరు నిర్మాణాలు చేపట్టినా, కబ్జా చేయడానికి ప్రయత్నించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


Similar News