రాత్రికి రాత్రే వందల టిప్పర్ల మట్టి మాయం
తల కొండపల్లి మండలంలోని కోరింతకుంట తండాలోని పోతురాజు చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
దిశ, తల కొండపల్లి: మండలంలోని కోరింతకుంట తండాకు సమీపంలో సర్వేనెంబర్ 257 లోని 7.02 గుంటల ప్రభుత్వ భూమిలో పోతురాజు చెరువు ఉంది. గత మూడు సంవత్సరాలుగా వేసవి కాలంలో ఆ చెరువులో ఉపాధి హామీ కూలీలతో లేబర్ పనులు కొనసాగిస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే చెరువులో నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఆ చెరువులోని మట్టిని తరలించి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కుల కన్ను పడింది. గత మూడు రోజులుగా అర్ధరాత్రి 11.00గంటల నుండి తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో దళారి వ్యాపారులు పెద్ద పెద్ద టిప్పర్లు హిటాచిలతో రాత్రికి రాత్రే మట్టిని నింపి ఇటుక బట్టీల తయారీకి, ఇసుక ఫిల్టర్స్ వద్దకు తరలిస్తున్నట్లు గిరిజనులు పేర్కొంటున్నారు. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు పది టిప్పర్లతో మట్టిని తరలిస్తుండగా అదే తండాకు చెందిన ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, ఉపాధి హామీ కూలీలు అక్కడికి చేరుకొని కాపు కాచి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి పట్టుకునే లోపే కొన్ని టిప్పర్లు పారిపోగా, కేవలం నాలుగు టిప్పర్లు ఒక హిటాచిని పట్టుకొని తలకొండపల్లి పోలీసులకు అప్పగించినట్లు గిరిజన కూలీలు పేర్కొన్నారు. పోతురాజు కుంట చెరువులో గత నెల రోజులుగా ఉపాధి హామీ పనులు చేస్తున్న మాకు కొలతలు చేసి మాండెడ్ లో ఇంకా బిల్లులు ఎక్కించక ముందే, మట్టి తరలించుకు పోతే మేము చేసిన పనులకు ఉపాధి హామీ అధికారులు కొలతలు ఎలా తీసి బిల్లులను ఎలా చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతురాజు కుంట చెరువులో దాస్య తండా, కోరింతకుంట తండా, పోతురాజు కుంట తండా, బోడియా తండాలకు చెందిన సుమారు 100 నుండి 150 మంది వరకు ఉపాధి కూలీ పనులు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. మండలంలోని కొంతమంది దళారి వ్యాపారులు ఉపాధి కూలీల పొట్ట కొట్టడమే కాకుండా, ప్రభుత్వ చెరువుల నుండి మట్టిని కొట్టే అధికారాలు వీరికి ఎవరిచ్చారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని మట్టిని తీయడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకుంటే రాత్రి వేళల్లో దళారులు ఎవరికి అనుమానం రాకుండా ఎందుకు తరలిస్తున్నారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
రాత్రి వేళల్లో సుమారు మూడు నుండి నాలుగు ఫీట్ల లోతు వరకు మట్టిని తవ్వి టిప్పర్ల సాయంతో ఇతర ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. చెరువు శిఖంలోని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమి ఉన్నా కూడా కేవలం వ్యవసాయ భూముల్లోకి మాత్రమే సారవంతమైన ఆ మట్టిని తరలించడానికి అధికారాలు ఉన్నాయని తహసిల్దార్ సూచించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న దళారులపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పరిసర ప్రాంతాల గిరిజన నాయకులు తహసిల్దార్, ఎంపీడీవో, మైనర్ ఇరిగేషన్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి గిరిజన కూలీలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోతురాజు కుంట చెరువులోని మట్టి తరలింపు పై ఉపాధి హామీ, పంచాయతీ అధికారులను దిశ వివరణ కోరగా మట్టి గత రెండు రోజుల నుంచి తరలించిన మాట వాస్తవమేనని, రాత్రి మా తండావాసులు కాపు కాసి పట్టుకొని పోలీసులకు అప్పగించారని తెలిపారు. కొంతమంది లేబర్ చేసిన పనులకు కొలతలు కూడా చేయలేదని సూచించారు.