నెరవేరిన సిక్కుల సొంతింటి కల: ఎంపీ రంజిత్ రెడ్డి

సిక్కులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల ఎట్టకేలకు నెరవేరిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-26 11:20 GMT

దిశ, రాజేంద్రనగర్: సిక్కులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల ఎట్టకేలకు నెరవేరిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ఎంపీ సిక్కులకు కన్వీనియన్స్ పట్టాలను అందజేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ సిఖ్ చావునిలో గత 200 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకొని సిక్కులు నివాసం ఉంటున్నారు. నిజాం ప్రభుత్వం హయాంలో రక్షణ కల్పించేందుకు సిక్కులు ఇక్కడకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ స్థలంలోనే నివాసం ఉంటున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వారికి ఆ స్థలాలకు సంబంధించి లబ్దిదారులుగా గుర్తించలేదు.

సిక్కుల అభ్యర్దనతో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలు సీఎం కేసీఆర్, కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక జీవో 118 తో పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లబ్ధిదారులు ఒక గజానికి 250 రూపాయలు చొప్పున చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం వెయ్యి మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ 726 మందిని అర్హులుగా గుర్తించారు. 540 మంది లబ్ధిదారులకు పట్టాలు రెడీ కాగా డబ్బులు చెల్లించిన 350 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు మాట్లాడుతూ.. సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ఏ ప్రభుత్వం ముందుకు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సిక్కుల కలను నెరవేర్చిందన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సిఖ్ ఛావునీ లో ప్రభుత్వ భూమిలో ఉన్న గురుద్వారా, స్కూల్ విషయమై త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి ఇస్తున్న మాదిరిగానే సిక్కులకు ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ఐదెకరాల భూమి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవ భవనం కోసం శంషాబాద్ పరిసర ప్రాంతంలో స్థలం పరిశీలిస్తున్నట్లు ఆర్డీవో చంద్రకళ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గురుద్వారాల అధ్యక్షురాలు ఐపీఎస్ మాజీ అధికారిణి తేజ్ దీప్ కౌర్, సివిల్ సప్లయ్ చైర్మన్  రవీందర్ సింగ్, ఆర్డీఓ చంద్రకళ, తహసీసిల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News