Rangareddy Collector : ప్రతి పథకం అర్హులకే అందాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా

Update: 2024-10-29 13:55 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా అధికారులుగా మనం కృషి చేద్దామని రంగారెడ్డి కలెక్టర్ (Ranga Reddy Collector) సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించే సూపరిటెండెంట్లకు, ఎన్యూమినేటర్లకు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆర్డిఓలు,(RDO) తాసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, మండల అభివృద్ధి అధికారులు, జిల్లా ప్రణాళిక అధికారులతో ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముందుగా నూతనంగా ఈ జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషం అన్నారు. జిల్లాలో విధులు నిర్వహించడానికి అవకాశం రావడం, ఈ అవకాశాన్ని నిర్వర్యం చేయకుండా ఇంకా బాధ్యతగా చేయడానికి ప్రత్యేకంగా రాష్ట్ర రాజధానికి అనుకోని ఉన్న మన జిల్లాకు అధికారిగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అదే తరుణంలో జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతను నిర్వీర్యం చేయకుండా బాధ్యతతో ఉద్యోగం నిర్వహిస్తే ప్రభుత్వంలో వారు పై స్థాయి ఉద్యోగులుగా ఎదుగుతారన్నారు. మన జిల్లాలో ప్రభుత్వం నుండి అమలు చేస్తున్న ప్రతి పథకంను గ్రామం నుండి పట్టణం వరకు ప్రతి స్థాయి పౌరులకు అందేలా కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి జిల్లా ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వారి బాధ్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి పౌరుడికి సేవకులమై సేవలందించాలన్నారు. ప్రైవేటు ఉద్యోగంలో ఆర్థికంగా ఎంత ఎదిగిన ఒకనొక స్థాయిలో చేసే తప్పులతో ఉద్యోగాల నుండి తొలగి రోడ్డున పడే వ్యవస్థలోకి వెళ్ళిపోతాం అన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా మనకు అందిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, ఉద్యోగిగా ఏమరపాటుతో, నిర్లక్ష దోరణిలో ఉంటే వారికి ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి ఉద్యోగి తన తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి విధులు నిర్వహిస్తూ, జిల్లాలో 100 శాతం టీమ్ వర్క్ తో జిల్లాను అభివృద్ధి చేసే దిశగా తోడ్పడాలని గ్రామ స్థాయి అధికారి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు శ్రద్దగా పని చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి జిల్లాకు ఎలాంటి నిందలు తలపెట్టకుండా బాధ్యతయుతంగా అందరం కలిసికట్టుగా ఉండాలని తెలిపారు.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నాణ్యతగల, నిజాయితీగల అధికారిగా జిల్లాలో మెలగాలన్నారు. కలెక్టర్ తన ఉద్దేశంలో జిల్లా ఇప్పడికే పని చేస్తున్న అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహించినందువల్లనే రాష్ర్ట రాజదాని అనుసందనాల్లో విధులు నిర్వహిస్తున్నామని మరో మారు గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ ట్రైనింగ్ లో పాల్గొన్న ఎన్యూమినేటర్, ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వేకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే నవంబర్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సర్వే కోసం ఎమ్యూనేటర్లు, ఎమ్యూనేటర్ల బ్లాక్, హౌస్ లిస్టింగ్ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మండలం వారీగా ఎంపీడీఓ (MPDO) లు,తహసీల్దార్లు ఎమ్యూనేటర్ల ఎంపికను శ్రద్ధతో జరిపి, వారి వివరాలను బ్లాక్ వారీగా అందజేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.

రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీలలో విలీనం కావడంలో ఎదురవుతున్న సమస్యల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డిజిటలైజేషన్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సర్వే నిర్వహణ కోసం ఎమ్యూనేటర్లకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను ట్రేనర్స్ ఆఫ్ ట్రేనర్స్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్వే పనిని వేగంగా మరియు విజయవంతంగా పూర్తి చేయడానికి అత్యుత్తమ ఎమ్యూనేటర్లను ఎంపిక చేయాలని, అవసరమైతే అదనంగా 10 శాతం ఎమ్యూనేటర్లు కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి తహసీల్దార్, ఎంపీడిఓ (MPDO) దగ్గర గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల నివాస స్థలాల మ్యాప్‌లు, హౌస్ లిస్టింగ్ ఫార్మాట్, 56 ప్రశ్నల ఫార్మాట్, సర్వే పూర్తి అయిన ఇంటిపై అతికించు స్టిక్కర్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ సర్వే అన్ని ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని, ఎటువంటి తప్పులు లేకుండా, ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

2011 జనాభా లెక్కల ప్రకారం మండలం వారీగా ఎంత జనాభా ఉంది, ఎంత మంది ఎన్యూమరేటర్లు, ఎంత మంది సూపర్ వైజర్ లు, మున్సిపల్ పరిధిలో ఎన్ని వార్డులు ఉన్నవి, ప్రస్తుతం వార్డు వారిగా ఎలా చేస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీడీఓలను (MPDO) పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక డేటాను ఈ నెల 30వ తారీఖు వరకు అందించాలని అన్నారు. అనంతరం పూర్తి స్థాయిలో డేటాను కనీసంగా నవంబర్ 1వ తేదీ లోపు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా మాస్టర్ ట్రైనర్ లు పీపీటి (PPT) ద్వారా సర్వే ఏవిధంగా చేయాలన్నది అందరికీ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సంగీత, జిల్లా ప్రణాళిక అధికారి పి.సౌమ్య, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News