చేవెళ్ల గడ్డపై రాజేంద్రనగర్ సత్తా చాటాలి : వేం నరేందర్ రెడ్డి
చేవెళ్ల పార్లమెంటులో రాజేంద్రనగర్ సత్తా చాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు.
దిశ, శంషాబాద్ : చేవెళ్ల పార్లమెంటులో రాజేంద్రనగర్ సత్తా చాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశం శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్సిసి కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దెదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పుడు మరోసారి మనకు మన సత్తా చాటే రోజు వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పథకాలను తీసుకువచ్చి 100 రోజులు గడవక ముందే అందులో నాలుగు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. మొట్టమొదటగా మహిళలకు రాష్ట్రమంతా తిరగడానికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు 2500 పథకాన్ని కూడా తీసుకువచ్చామని ఈ ఎన్నికల కోడ్ గడిచిన వెంటనే అన్ని పథకాలు అమల్లోకి వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లి బూతు స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా చేతి గుర్తుపై ఓటు వేయడానికి కృషి చేయాలి అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ గెలిచేందుకు కృషి చేయాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని అంతా కాంగ్రెస్ గ్రూప్ అన్నారు. ఐదు ఏళ్ళు ఎంపీగా పనిచేసిన నేను ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడలేదని అలా ఆధారాలతో నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తానన్నారు. ఆగస్టు 15 రైతులకు రెండు లక్షల రుణమాఫీ దేవుని సాక్షిగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాన్ని నెరవేరుస్తామని అన్నారు. బూత్ కమిటీ నాయకులు ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో 100% ఓట్లు పడేవిధంగా ఇంటింటికి తిరుగుతూ మోటివేషన్ చేయాలన్నారు.
అందరూ కష్టపడి పని చేస్తేనే మనం విజయం సాధిస్తామని, అప్పుడు ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి నరేందర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్,నాయకులు రాజేందర్ రెడ్డి, జలపల్లి నరేందర్, సులోచన, అశోక్ యాదవ్, కృష్ణారెడ్డి, సంజయ్ యాదవ్, శేఖర్ యాదవ్, చెక్కల ఎల్లయ్య, యాదగిరి రెడ్డి, సామ ఇంద్రపాల్ రెడ్డి, అశోక్, బూత్ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షుడు, గ్రామ కమిటీ నాయకులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.