లగచర్ల,రోటిబండ తండాలలో పర్యటించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం సోమవారం లగచర్ల,రోటిబండ తండాలలో పర్యటించారు.
దిశ, బొంరాస్ పేట్ :- రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం సోమవారం లగచర్ల,రోటిబండ తండాలలో పర్యటించారు. లగచర్ల ఘటన పై మహిళలను అడిగి తెలుసుకున్నారు. తమ కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మ విషయంపై కోడంగల్ లో సీఎంను కలవడానికి పోతే, మమ్మల్ని అరెస్ట్ చేసి,స్టేషన్ కు తరలించారు అన్నారు. కలెక్టర్,కడా అధికారికి,మాజీ ఎమ్మెల్యేకు ఫార్మా వద్దని, వినతి పత్రాలు కూడా ఇచ్చామని చెప్పారు. బ్యాంకులలో రుణాల కోసం వెళితే,అధికారులు రుణాలు ఇవ్వలేదన్నారు. గొడవలకు సంబంధం లేనటువంటి వారిని కూడా అరెస్టు చేశారని చెప్పారు. భూములు అవసరం మాకు, భూములను నమ్ముకొని, బ్రతుకుతున్నామని,అలాంటి భూములను ఇచ్చేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ… మీరు భయపడకండి, దాడులు కాకుండా చూసుకుంటామని మీకోసమే కమిషన్ ఉందన్నారు.
అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై మాత్రమే కేసులు పెట్టి శిక్షించాలన్నారు. దాడి చేయని అమాయకులైన గిరిజనులను అరెస్టు చేసి జైలులో పెట్టడం కరెక్ట్ కాదన్నారు. దాడికి సంబంధం లేనటువంటి వారిని విడిచిపెట్టి వారిపై పెట్టిన కేసును రద్దు చేయాలని ఎస్పీకి ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలపై ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్టు అందజేయాలని కోరారు. గిరిజనులు గిరి పుత్రులని, కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా వారు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారు. భూమి పోతే,మేము ఏమి చేయాలి,మా పిల్లలు ఎక్కడికి వెళ్లి పనులు చేయాలని ఆందోళన చెందుతున్నారని అన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలో నోటీసులు ఇవ్వాలి,చాటింపు చేయాలి, గ్రామసభలు పెట్టి, అందరి అభిప్రాయాలు తీసుకొని దఫా దఫాలుగా చర్చించి సంప్రదిస్తూ సమస్యను పరిష్కరించాలన్నారు.
అన్యాయమైన గిరిజనులపై కేసులు ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని, అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి గ్రామాలలో జరుగుతున్న పరిణామాలను,పరిస్థితులను వివరిస్తామన్నారు. రైతులు భూములు ఇచ్చే పరిస్థితుల్లో లేరని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కోరుతామన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటామని తెలిపారు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీనికిగాను పోలీసులు దాడులు ఆపి, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని పోలీస్ శాఖను కోరుతున్నాం అన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల, రైతుల భూములు కాపాడి న్యాయం చేయాలని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం వికారాబాద్ చేరుకొని ఎస్పీ నారాయణరెడ్డితో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, శంకర్, నీలాదేవి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం,డిటి వీరేష్ బాబు,తదితరులు ఉన్నారు.