Protocol Controversy : మంత్రి సభలో ప్రోటోకాల్ వివాదం
మంత్రి సభలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ప్రోటో కాల్ పాటించలేదని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, బడంగ్ పేట్ : మంత్రి సభలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ప్రోటో కాల్ పాటించలేదని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు రూ. 38 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనుల శిలాఫలకాన్ని శనివారం ఐటీ శాఖ, భారీ పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రోటో కాల్ పాటించలేదని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచారు. మంత్రి ప్రోగ్రామ్ కావడంతో కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లు వేదికపైకి పిలవకున్నా ఎక్కారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను ఒక్కొక్కరిని పేరు పేరున పిలవకుండా బడంగ్పేట్ కు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఒకేసారి రావాలంటూ సభా అధ్యక్షుడు పిలవడం వివాదంగా మారింది.
కార్పొరేషన్‌కు సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలిచిన సభా అధ్యక్షుడు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను మాత్రం ఒకే సారి రమ్మంటారా? ప్రొటో కాల్ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జనరల్ ఫండా? కాంగ్రెస్ పర్సనల్ ఫండా ? ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమంలా నిర్వహించారని కార్పొరేటర్లు మండిపడ్డారు. బడంగ్ పేట్ కార్పొరేటర్లకు ఇది అవమానకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మైక్ అందుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బడంగ్ పేట్ కార్పొరేషన్లో జరుగుతున్న మొట్టమొదటి అభివృద్ది పనులని వ్యతిరేకించ వద్దని అంటూనే, గతంలో మీకు ప్రోటోకాల్ గుర్తు రాలేదా ? అంటూ దుయ్యబట్టారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సైతం కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు వెనుదిరిగారు. అయితే కావాలనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రోటోకాల్ వివాదం తెరమీదకి తీసుకొస్తున్నారని ప్రతి ఒక్కరిని స్టేజీ మీదకి ఆహ్వానించామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు, మహేశ్వరం ఇంచార్జి కేఎల్ ఆర్లు స్థానిక ఏసీపీ, మీర్పేట్ ఇన్స్పెక్టర్ లపై ఎందుకు కంట్రోల్ చేయలేక పోయారని కాస్త సీరియస్ అయ్యారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత
బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అంతేగాకుండా అర్హులైన నిరుపేదలందరికీ అతి త్వరలో ఇండ్లు కట్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు యునిఫాంలను ఇంతకుముందు ప్రైవేట్ వారికి ఇచ్చి కుట్టించేవారని, ప్రస్తుతం స్వశక్తి మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలను కుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కొన్ని మహిళా సంఘాలను గుర్తించి, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ, ఇందిరా మహిళా క్యాంటిన్ లు ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో పాఠశాలలో ఎక్కడయితే టాయిలెట్స్ లేవో అక్కడ టాయిలెట్స్ నిర్మించి ఇస్తామని చెప్పారు. చాలా మందికి రేషన్ కార్డులు లేవని, కొత్త రేషన్ కార్డులు కావాలని అడుగుతున్నారని,
గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. అంతేగాకుండా స్థానిన పుష్ప అనే మహిళ దరఖాస్తు ఇచ్చిన నెలరోజులు అవుతున్నా తమకు ఉచిత కరెంటు పథకం అమలుకావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు పుష్పమ్మ ఉచిత కరెంట్ పథకం ఎంతవరకు వచ్చిందని బడంగ్ పేట్ కమిషనర్ రఘును నిలదీశారు. ఉచిత కరెంటు పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలయ్యేలా చూడాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, కందుకూర్ ఆర్డీఓ సూరజ్‌కుమార్, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి కేఎల్ఆర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, బడంగ్ పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, బడంగ్ పేట్ కమిషనర్ జి.రఘు తో పాటు కార్పొరేటర్లు తోట శ్రీధర్‌రెడ్డి, సూర్ణగంటి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.