ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ

మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆనంద్

Update: 2024-10-10 15:54 GMT

దిశ,శంకర్పల్లి : మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి ఇవ్వడం పట్ల కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో వాగ్వాదానికి దిగారు. శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య ను కొండకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘోరావ్ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఛాంబర్ లోకి ఎమ్మెల్యే కాలే యాదయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డిలు రాగా, కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ నాయకులు కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ కొండకల్ గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఛాంబర్ లో ఉన్న వాళ్లందర్నీ బయటకు పంపించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున వారు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పీసీసీ కార్యవర్గ కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి తదితరులు సముదాయించినప్పటికీ వారు ససేమిరా అన్నారు. మీ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పార్టీలో చేరని వ్యక్తి సభ్యత్వం సైతం తీసుకొని వ్యక్తిని ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా పరిగణించాలో మీరే చెప్పాలని వారు వాగ్వాదానికి దిగారు.

కొండకల్ గ్రామానికి చెందిన నాయకునికి చైర్మన్ గా ఇవ్వడంతో పాటు అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికి డైరెక్టర్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. గ్రామానికి రెండు పదవులు ఇవ్వడం కూడా ఇతర గ్రామాలకు చెందిన వారు ఎమ్మెల్యే తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మీరు సూచించిన వ్యక్తికే డైరెక్టర్ పదవి ప్రతిపాదిస్తానని ఎట్టకేలకు హామీ ఇవ్వడంతో కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతించి వెళ్ళిపోయారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ వెంకట రామిరెడ్డి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తహసీల్దార్ సురేందర్ తదితరులు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.


Similar News