Caste census : ఆ వివరాలు అడిగితేనే చిర్రెత్తుతున్న ప్రజలు..

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆ.. ప్రశ్నలు అడిగితేనే ప్రజలు చిర్రెత్తుతున్నారు. ఎన్యునరేటర్లతో పాటు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

Update: 2024-11-14 02:35 GMT

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆ.. ప్రశ్నలు అడిగితేనే ప్రజలు చిర్రెత్తుతున్నారు. ఎన్యునరేటర్లతో పాటు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో ఉన్న 48 సంఖ్య నుంచి 54వ సంఖ్య వరకున్న వివరాలు చెప్పాలంటే ఓవైపు నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. ప్రజా పాలనలో చేసిన దరఖాస్తులకు ఇప్పటికీ దిక్కులేదని, మళ్లీ ఎందుకు ఇలాంటివి అంటూ ప్రశ్నిస్తున్నారు. తాము ప్రభుత్వం తరఫున సర్వే కోసం మాత్రమే వచ్చామని పదేపదే ప్రజలకు చెప్పలేక ఎన్యుమరేటర్లు విసుగు చెందుతున్నారు. 48వ నంబర్ నుంచి 54 వరకున్న కొన్ని ప్రశ్నల్లో ఉన్నటువంటివి.. ‘ఎక్కడైనా రుణాలు తీసుకున్నారా..? ఎందుకోసం తీసుకున్నారు..? వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు..? రేషన్ కార్డు ఉందా ? ఇంటి గోడలు దేనితో కట్టారు ? ఇంటికి విద్యుత్ సౌకర్యం ఉందా? గ్యాస్ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా?

వాషింగ్ మిషన్ ఉందా? మీకు అప్పుఎంత ఉంది? ఏ విధంగా తీరుస్తారు? వంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆధార్ కార్డు నంబర్లు, ఇంటి యజమాని పేరు, కుటుంబ నేపథ్యం గురించి పర్వాలేదు కానీ వంట గ్యాస్, మీరు ఉంటున్న ఇల్లు డబుల్ బెడ్ రూమ్..? సింగిల్ బెడ్ రూమ్..? మరుగుదొడ్డి ఉందా ? లేదా? వంటి ప్రశ్నలకు మాత్రం కోపగించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ వివరించేందుకు సైతం ఎన్యుమరేటర్లు తిప్పలు పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరిగే కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అన్నీ ఇన్నీ కావు.

Tags:    

Similar News