అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌గా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ.. పట్టించుకోని అధికారులు

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Update: 2024-07-07 03:02 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రజాప్రతినిధుల అండతో చేసేదిలేక అధికారులు తలోగ్గుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎక్కడో గల్లీలలో నిర్మాణాలు జరిగితేనే నోటీసుల పేరుతో కూలగొట్టే అధికారులు నిత్యం తిరిగే రోడ్ల వెంట పెద్ద ఎత్తున కమర్షియల్‌గా నిర్మాణాలు చేపడుతున్నా ఆవైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పైగా వాళ్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన కిందిస్థాయి నుంచి పై అధికారుల వరకు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే తామేం చేయలేకపోతున్నామని చెప్పడం మరి విడ్డూరంగా కనిపిస్తోంది. తట్టి అన్నారం అంబేద్కర్ చౌరస్తాలో అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున చేపడుతున్న వ్యాపార సముదాయాల నిర్మాణం పూర్తి కావస్తుంది.

స్థానిక ప్రజా ప్రతినిధుల్లో కొంతమంది ఒత్తిడి మేరకు ఆ వైపు అధికారులు చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బునాది స్థాయి నుంచి నిత్యం అక్రమ నిర్మాణాలని అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో వాటిని పట్టించుకునే నాధులు కరువయ్యారు. ఇన్ చార్జి పాలనలో సాగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారి ఆయనకు అవసరం ఉన్నప్పుడు మినహా ఇటువైపు కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వచ్చే రెండు మూడు రోజులు ఫీల్డ్ వర్క్ పేరిట వసూళ్ల వేటలో పడ్డాడని స్థానికులు విమర్శిస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ గృహకల్ప పక్కన ఉన్న రెండో వార్డులో సైతం అనుమతి లేకుండా నిర్మాణాలు జోరు అందుకున్నాయి.

అనుమతులు ఒకలా...నిర్మాణాలు మరోలా...?

రాజీవ్ గృహ కల్ప పరిధిలో మొదలయ్యే రెండో వార్డు పరిధిలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమానాలు తీసుకున్నారు. ఇంటి నిర్మాణంలోనే అదనంగా పెంట్ హౌస్ వేస్తే ఊరుకోని అధికారులు దరఖాస్తు చేసుకున్న ఇంటిని కాకుండా వ్యాపార సముదాయం షట్టర్లు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా అనుమతులు తీసుకున్నారు కదా ఏదో ఒకటి నిర్మించుకుంటారు వాళ్ల ఇష్టం అన్నట్లుగా అధికారులే పత్రికలకు వివరణ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ విధంగా చెప్పుకుపోతే పెద్ద అంబర్పేటలోని అనుమతుల నిర్మాణాలకు పూర్తిస్థాయిగా కేరాఫ్ గా మారండి అనడంలో ఏమాత్రం సందేహం లేదని స్థానికులు గుసగుసలాడుకుంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరేందుకు దిశ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


Similar News