వైఫల్యం ఎవరిది..?

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొనసాగాల్సిన సర్వసభ్య సమావేశాలు కొంతకాలంగా అభాసుపాలవుతోంది.

Update: 2022-10-21 11:45 GMT

దిశ, పరిగి : సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొనసాగాల్సిన సర్వసభ్య సమావేశాలు కొంతకాలంగా అభాసుపాలవుతోంది. కేవలం ఎజెండాలోని అంశాలు చదివి వినిపించడం, చాయ్,​ పానీ, బిస్కెట్​ తిని ముగించి చేతులు దులుపుకుంటే సమావేశమైపోయినట్లేనని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మండల సర్వసభ్య సమావేశానికి సుమారు 19 శాఖల అధికారులు రావాల్సి ఉండగా కేవలం 10 శాఖల అధికారులతోనే సమావేశాలు కానిచ్చేస్తున్నారు.

డివిజన్​ శాఖల అధికారులు ఉన్నా కేవలం, ఏఈ, సీనియర్​ అసిస్టెంట్లు, జూనియర్​ అసిస్టెంట్లు వాళ్ల కింది స్థాయి సిబ్బందిని పంపిస్తే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ఆయా శాఖల అధికారులు లేకపోవడంతో సమస్య కేవలం చర్చించి ఫోన్లో మాట్లాడి వదిలేయాల్సి వస్తుంది. మళ్లీ సర్వసభ్య సమావేశం వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్లు తయారైంది పరిస్థితి.

సర్వసభ్య సమావేశానికి ఎందుకు రాలేదని, వరుసగా మూడు సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరైన వారిపై ఎంపీటీసీలు అందరూ కలిసి తీర్మాణం చేసి ఎంపీడీఓకు ఇస్తే గైర్హాజరైన అధికారులపై కలెక్టర్​ కు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాని మన నియోజకవర్గ ఎంపీటీసీల మంచితనమో, తెలియకపోవడమే కాని అధికారులు మాత్రం చేతకాని తనమే అని అనుకుంటున్నారు.

సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టే అధికారులతో కూడా పనిచేయించాల్సిన​ బాధ్యత ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలపై ఉంది. పరిగి నియోజకవర్గంలో ఎక్సైజ్​ శాఖ, పశుసంవర్థకశాఖ, ఆర్టీసీ, నీటి పారుదలశాఖ, ఉద్యాణవణ, మత్స్యశాఖ అధికారులు వరుసగా సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరవుతున్నా పట్టించుకోవడం లేదు.

ఇక హెల్త్​ డిపార్ట్​ మెంట్ అధికారులు హెల్త్​ అసిస్టెంట్లను పంపించి మమ అనిపిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, పూడూరు, కుల్కచర్లలో ఏ ఒక్క మండలంలో డుమ్మాకొడుతున్న అధికారులపై గైర్హాజరవుతున్నట్లు తీర్మాణించి నివేధిక ఇవ్వలేకపోయారు. ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాలకు అన్నిశాఖల అధికారులు హాజరయ్యేలా చూస్తూ, ప్రాధాన్యత ఇస్తూ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికితే బాగుంటుందని నియోజకవర్గ సర్పంచులు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News