పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు...పట్టించుకోని అధికారులు

కొన్ని ప్రాంతాలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవలసిన అధికారులు ఆ నాయకుడు పేరు చెప్తే చాలు.. జంకుతున్నారు.

Update: 2022-09-23 10:46 GMT

దిశ, గండిపేట్ : కొన్ని ప్రాంతాలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవలసిన అధికారులు ఆ నాయకుడు పేరు చెప్తే చాలు.. జంకుతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్య లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జీప్లస్ టూ కి అనుమతులు తీసుకొని ఎలాంటి నిబంధనలు పాటించకుండా రోడ్డును సైతం ఆక్రమించుకొని సెల్లార్లను తవ్వి జీ ప్లస్4, జీ ప్లస్5 నిర్మాణాలు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే గండిపేట్ న‌గ‌ర శివారులో అక్ర‌మ నిర్మాణాల జోరు కొన‌సాగుతుంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించిన క‌ట్ట‌డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కి నిర్మిస్తున్న అక్ర‌మ నిర్మాణాల‌ను అరిక‌ట్ట‌డంలో అధికారులు సైతం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా అక్ర‌మ నిర్మాణాదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వ అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ‌కేమి ప‌ట్టిందిలే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌గ‌ర శివారు అస‌లే వేగంగా అభివృద్ది జ‌రుగుతున్న క్ర‌మంలో మున్సిపాలిటీల‌ను అక్ర‌మ నిర్మాణాల ప‌డ‌గ కాటేస్తుంది. ప్ర‌ధానంగా నార్సింగి మున్సిపాలిటీలోని గండిపేట్ గ్రామంలోని వైన్స్ షాపు పక్కన అనుమతులకు మించి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిర్మాణాల పట్ల అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అధికారులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గండిపేటలో జరుగుతున్న అక్ర‌మ నిర్మాణాల‌ను తొంగి చూసే నాధుడే క‌రువ‌య్యాడు.

అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల మౌనం కాస్త అక్ర‌మ నిర్మాణ‌దారుల‌కు వ‌రంలా మారింది. దీంతో తాము ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అక్ర‌మ నిర్మాణాల‌ను కొన‌సాగిస్తున్నారు. మున్సిపాలిటీలోని క్యూసిటీలో అక్ర‌మ నిర్మాణాలు య‌దేచ్ఛగా కొన‌సాగుతున్నాయి. ప‌దుల కొద్ది భ‌వ‌నాలకు ఎలాంటి అనుమ‌తులు ఉండ‌క‌పోవ‌డంతో పాటు భ‌వ‌నాల‌కు తీసుకున్న అనుమ‌తుల‌కు విరుద్ధంగా అంత‌కు మించి భ‌వ‌నాల‌ను నిర్మిస్తున్నారు. ఇంత జ‌రుగుతుంద‌ని తెలిసినా అధికారులు ఎందుకు మౌనం వ‌హిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. నార్సింగి మున్సిపాలిటీలో అక్ర‌మ నిర్మాణాల‌ను గుర్తించి కూల్చివేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. అధికారుల‌కు అన్ని తెలిసే మౌనంగా ఉంటున్నార‌ని మ‌రికొంద‌రు ఆరోపిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం అక్ర‌మ నిర్మాణ‌దారుల‌కు వ‌రంలా మారింద‌ని అంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అక్ర‌మ నిర్మాణాల‌ను చూసి చూడ‌న‌ట్లుగా వ‌దిలేస్తున్నారంటే అందులో మ‌తుల‌బు ఏంటా ప్ర‌జ‌లు ప‌లు సందేహాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. మున్సిప‌ల్ ఆదాయానికి దీని ద్వారా భారీగా గండి కొడుతున్నా అధికారులు నిర్మాణ‌దారుల‌తో చేతులు క‌లిపి ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. నిర్మాణ‌దారులు ఇచ్చే ముడుపుల‌కు ఆశ‌ప‌డే అధికారులు మౌనం వ‌హిస్తున్నార‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

ముడుపుల కోస‌మేనా మౌనం..?

నార్సింగి మున్సిప‌ల్ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాలు య‌దేచ్ఛ‌గా జ‌రుగుతున్నా అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు మౌనం వ‌హించేది కేవ‌లం ముడుపుల కోస‌మేనా అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో అక్ర‌మ నిర్మాణాల‌కు స‌హ‌క‌రిస్తున్నారంటే ఎంత పెద్ద మొత్తంలో అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌ని స్థానికులు అంటున్నారు. ముడుపుల కోసం పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్ట‌డం ఏంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు అక్ర‌మ నిర్మాణాల‌కు కొమ్ము కాయ‌కుండా అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కుపాదం మోపాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News