క‌బ్జాకు గుర‌వుతున్న నెక్నాంపూర్ చెరువు

ఇటివ‌ల కాలంలో కురిసిన వ‌ర్షాల‌కు ఎక్క‌డెక్క‌డ‌ చెరువులు, కుంట‌లు నిండాయో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

Update: 2024-10-13 13:52 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో/ గండిపేట్ : ఇటివ‌ల కాలంలో కురిసిన వ‌ర్షాల‌కు ఎక్క‌డెక్క‌డ‌ చెరువులు, కుంట‌లు నిండాయో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అందులో భాగంగా గండిపేట్ మండ‌లంలోని నార్సింగి, మ‌ణికొండ మున్సిపాలిటీ లోని చిన్న చెరువు క‌బ్జాకు గుర‌వుతుంది. నార్సింగి మున్సిపాలిటీ, మ‌ణికొండ మున్సిపాలిటీల ప‌రిధిల‌లోని గండిపేట్ రెవెన్యూ ప‌రిధిలో ఉండ‌టంతో దీన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే ఉద్దేశ్యంతో ఓ బ‌డా వ్యాపారి అక్ర‌మ నిర్మాణాల‌కు ఒడిగ‌ట్టారు. ఇదే ప్ర‌ధాన కార‌ణంగా రెవెన్యూ, ఇరిగేష‌న్‌, మున్సిప‌ల్ అధికారులు క‌న్నెత్తి చూడ‌టం లేదు. ఇటీవ‌ల కాలంలో చెరువులను స‌ర్వే చేస్తున్న క్ర‌మంలో నెక్నాంపూర్ చెరువుల‌పై హైడ్రా క‌న్నేసిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే దీనిపై సంబంధిత అధికారుల‌ను ఈ చెరువు బఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్ హ‌ద్దుల వివ‌రాల‌ను అడిగిన‌ట్లు తెలుస్తుంది.

ఈ చెరువుకు ఊరేనా..?

మ‌ణికొండ, నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలో విస్త‌రించిన నెక్నాంపూర్ చిన్న‌చెరువు ప‌రిర‌క్ష‌ణ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దీని ప‌క్క‌న బ‌ఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఆనంద హోమ్స్ సంస్థ భారీ నిర్మాణాల‌కు తెర లేపింది. చెరువు ప‌క్క‌న ఉండ‌టం చేత వ‌ర్ష‌పునీరు వ‌చ్చి చేరుతుంది. మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలోని నెక్నాంపూర్ స‌ర్వే నెంబ‌ర్లు 57, 58, 59, నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని 93, 328 స‌ర్వే నెంబ‌ర్ల‌లోని చిన్న చెరువు ప‌రిధిలోని బ‌ఫ‌ర్ జోన్‌లో నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. స్థానికంగా ఆనంద హోమ్స్ అనే సంస్థ వారు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను చేపట్టారు. ఓ పక్క ఇరిగేషన్ అధికారులు తమకేమీ పట్టిందిలే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో చెరువులు, కుంటలు, తటాకాలను వదలకుండా కబ్జాదారులు కబ్జాలు చేసి నిర్మాణాలను చేపడుతున్నారు.

నగర ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఈ నిర్మాణాలు నిలుస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఆయా మున్సిపాలిటీల అధికారులు నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టకుండా అక్రమార్కులకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మండల పరిధిలోని పలు ప్రధాన చెరువులు, కుంటలు, తటాకాలు, అక్రమాలకు గురవుతూ ఆక్రమణల బారిన పడుతున్నాయి. దీంతో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ వంటి స్థాయిల్లో నిర్మాణాలు జరిగిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల నగర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఏర్పాటుచేసిన హైడ్రా చెరువులు కుంటలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో గండిపేట మండల పరిధిలోని మణికొండ మునిసిపాలిటీ, నార్సింగి మున్సిపాలిటీలలో విస్తరించి ఉన్న చిన్న - పెద్ద చెరువుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. `దీంతో మున్సిపాలిటీ అధికారులు తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.

దీనికి తోడు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నిర్మాణాలపై మిన్నకుండిపోతున్నారు. ఇక చెరువులను అక్రమ నిర్మాణాల నుంచి కాపాడాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఇటీవల ఏర్పాటైన హైడ్రా ఇలాంటి చెరువుల సంరక్షణ కోసం నిర్మాణాలను కూల్చివేసి చెరువులను కాపాడుతున్న నేపథ్యంలో చిన్న పెద్ద చెరువును కాపాడాల్సిన ఆవశ్యకతను స్థానికులు గుర్తించారు. అధికారులు నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్న నేపథ్యంలో హైడ్రా అయినా నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెరువులను కాపాడి వాటిని సంరక్షించాల్సిన మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మౌనంగా ఉండిపోవడం చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా ఈ చెరువు పట్ల తీసుకునే చర్యలపై అంతట ఆసక్తి నెలకొంది.

అధికారులకు నచ్చితే రెడ్ కార్పెట్ లు...

గండిపేట మండల పరిధిలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల తీరు అక్రమార్కులకు సహకరించేలా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. కానీ వారు కబ్జా దారులకు పూర్తి మద్దతును పరోక్షంగా కల్పిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చిన వారికి అక్రమంగా నిర్మాణాలను చేపట్టేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అక్రమంగా నిర్మించే ఇలాంటి ఆనంద హోమ్స్ వారికి మంచి అవకాశంగా మారింది. అధికారుల తీరుతో విసిగిపోయామని ప్రజలు తెలుపుతున్నారు. అక్రమంగా చెరువులను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వారికి నచ్చిన వారికి రెడ్ కార్పెట్లు వేయకుండా నిబంధనల మేరకు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అసలు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి....?

స్థానికంగా నిర్మాణాలు చేపట్టేందుకు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ విభాగాల అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ నిర్మాణం పూర్తయ్యాక అక్రమ నిర్మాణాలు అంటూ చేపట్టే చర్యల వల్ల సామాన్యుడు నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా కొనుగోలు చేసినట్లు అప్పుడు వారికి అర్థమవుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇళ్లను కొనుగోలు చేసిన, అక్రమంగా నిర్మించి అమ్ముతున్న నేపథ్యంలో వినియోగదారుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు ఎలా ఉన్నాయని అంశంపై ప్రజలు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ మేరకు అక్రమంగా చేపట్టే నిర్మాణాల పట్ల జాగ్రత్త వహించాలని పలువురు సూచిస్తున్నారు.


Similar News