మీరు న‌న్నేంటి ప్ర‌శ్నించేది..

నార్సింగి మున్సిపాలిటీలో ప్రజా ధ‌నం వృధా అవుతుంది.

Update: 2023-02-17 12:38 GMT

దిశ, గండిపేట్ : నార్సింగి మున్సిపాలిటీలో ప్రజా ధ‌నం వృధా అవుతుంది. ప‌ట్టించుకోవాల్సిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌కు ఏం ప‌ట్టిందిలే అన్నచందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన క‌నీసం మౌలిక వ‌స‌తుల‌ను నిర్వాహ‌ణ చేప‌ట్ట‌డంలోనూ అధికారులు పూర్తిగా వైఫ‌ల్యం చెందుతున్నారు. ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించి ఓపెన్ జిమ్‌లను ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఏర్పాటు చేశారు. అయినా వాటిని నిర్వాహ‌ణ చేప‌ట్టే తీరిక మాత్రం అధికారుల‌కు లేక‌పోవ‌డం శోఛ‌నీయంగా ఉంద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం న‌గ‌రాల్లో పార్కుల‌లో ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తుంది. అయితే అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన విధంగానే నార్సింగి మున్సిపాలిటీలోని పార్కుల‌లోనూ ఇదే విధంగా ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నార్సింగి మున్సిపాలిటీలోని 9 వ వార్డులో ఓపెన్ జిమ్‌లో ప‌రిక‌రాల‌ను అమ‌ర్చారు. కాగా వాటిపై నిర్వాహ‌ణ లేక‌పోవ‌డంతో రోజురోజుకు అవి నిరుప‌యోగంగా మారుతుండ‌టం, మ‌రో ప‌క్క స్థానికంగా కొంద‌రు హ‌స్తక‌ళాకారులు త‌మ చేతికి ప‌ని చెప్పి వాటిని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇది గ‌మ‌నించి క‌మిష‌న‌ర్‌ను ప్ర‌శ్నిస్తే క‌మిష‌న‌ర్ దురుసుగా స‌మాధానాలు చెప్ప‌డం మ‌రో విశేషం.

క‌నీస ప‌ర్యవేక్ష‌ణ లేకుండా ఉంటే ఎలా అన్న సందేహం ఎవ‌రికైనా క‌లుగుతుంది. కానీ క‌మిష‌న‌ర్‌కు మాత్రం ఆ ధ్యాస లేక‌పోవ‌డం విచిత్రంగా ఉంద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. క‌మిష‌న‌ర్ జేబులో నుంచి డ‌బ్బులు పెట్టి ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారా.. వాటి నిర్వాహ‌ణ గాలికి వ‌దిలేస్తే ఎవ‌రు ప‌ట్టించుకుంటారని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా క‌మిష‌న‌ర్‌కు క‌నీసం క‌నిపించ‌డం లేదా అనేసందేహాన్ని ప్ర‌జ‌లు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అంతేకాకుండా నిర్వీర్య‌మౌతున్నా, చోరీకి గురి అవుతున్నా ప‌ట్టించుకోకుండా, కేవ‌లం పోయినా వాటికి బ‌దులుగా కొత్త‌వి తెస్తూనే ఉన్నారు. దీనిక‌న్నా ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌డితే ఎంతో మేలు క‌దా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి జిమ్ ప‌ర్యవేక్ష‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

వివ‌ర‌ణ అడిగితే.. దురుసు స‌మాధానం..?

మున్సిపాలిటీలోని తొమ్మిద‌వ వార్డులో ఓపెన్ జిమ్ ప‌రిక‌రాలు లేవ‌ని, ఉన్న వాటిని దొంగ‌లు ఎత్త‌కెళ్ల‌డం, నిర్వీర్య‌మైపోతున్నాయ‌ని, వీటిపై స్పందించాల‌ని క‌మిష‌న‌ర్‌ను కోర‌గా క‌మిష‌న‌ర్ త‌న‌దైన శైలీలో స్పందించారు. అంత త‌మ ఇష్టం, మీరు మ‌మ్మ‌ల్ని ఏంటి అడిగేదంటూ ఇచ్చిన జ‌వాబు మీడియా మిత్రుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. సామాజిక బాధ్య‌త‌గా తాము అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సింది పోయి క‌మిష‌న‌ర్ త‌న ఇష్టానుసారంగా మాట దాట‌వేసేందుకు య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. లక్షల రూపాయలు పెట్టి ఎక్విప్ మెంట్స్ తెస్తే జిమ్ పరికరాలు లేకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఎవరు తీసుకెళ్తున్నారు ఇక్కడ పోతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతున్నా అధికారుల మౌనం మ‌రింత అనుమానాల‌కు తావిస్తుంది. ఇప్ప‌టికైనా క‌మిష‌న‌ర్ దురుసు త‌నం త‌గ్గించుకొని ప‌ర్య‌వేక్ష‌ణ‌పై దృష్టి సారించాల‌ని ప్ర‌జ‌లు బ‌హిరంగంగా సూచిస్తున్నారు.

Tags:    

Similar News