మాసాబ్‌చెరువు మసకబారుతోంది..

తుర్కయంజాల్‌లోని మాసాబ్‌ చెరువు ఆత్మ ఘోషిస్తోంది.

Update: 2023-05-21 12:25 GMT

దిశ, తుర్కయంజాల్‌: తుర్కయంజాల్‌లోని మాసాబ్‌ చెరువు ఆత్మ ఘోషిస్తోంది. సుమారు 40 ఏళ్ల తర్వాత నిండుకుండలా మారి రైతు పొలాలను పచ్చగా మార్చి, ప్రజలను, ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్న తాను కబ్జాకోరులు, రియల్టర్ల ధనదాహానికి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడుతుతున్నాని ఆవేదన చెందుతోంది. అధికారుల నిర్లక్ష్య వ్యవహారం, గత పాలకులు కాసుల కక్కుర్తితో ఇష్టారీతిన ఎన్వోసీలు ఇవ్వడం తనకు శాపంగా మారిందని దీనంగా రోదిస్తోంది.

మాసాబ్‌చెరువు ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితులు కళ్లెదుట ప్రస్పుటంగా కనబడుతున్నాయి. వేలకోట్ల రూపాయల విలువైన భూములను కొట్టేయాలన్న దుర్బుద్ధితో చెరువును నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 506 ఎకరాల చెరువు భూమిని ఇంచు కూడా మిగలకుండా కొట్టేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. చెరువు ఎఫ్టీఎల్‌ పరిధిలోని 205 సర్వే నెంబర్‌లోని సుమారు 14 ఎకరాల స్థలంలో నాగార్జునసాగర్‌ రోడ్డుకు ఆనుకొని సుమారు 6గజాల ఎత్తున మట్టిని నింపారు.

బడా ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారుల ప్రోద్బలంతో పకడ్బందీగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుని మరీ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. రాత్రిపూట వందలాది టిప్పర్లు, పొక్లెయినర్లతో చెరువులో మట్టిని నింపి ప్లాట్లుగా మలిచే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దీన్ని అఖిలపక్ష నాయకులు, స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ప్రతిఘటించడంతో నాలుగైదు రోజుల నుంచి పనులు సాగడం లేదు.

ఇదిలా ఉండగానే మరోవైపు నుంచి...

గుర్రంగూడ టీచర్స్‌కాలనీ వైపు నుంచి సర్వే నెంబర్‌ 137లో చెరువు మధ్యలో భారీగా మట్టి డంప్‌ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు కిలోమీటర్‌ పొడవున 60 ఫీట్ల వెడల్పుతో వందలాది టిప్పర్లతో చెరువులో మట్టి పోయించారు రియల్టర్లు. పెద్దపెద్ద బండరాళ్లతో పూడ్చివేసి చెరువును రెండుగా చీల్చారు. సిరీస్‌ కంపెనీ మట్టి తెచ్చి నింపడంతో చెరువు విషతుల్యమై చేపలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న అఖిలపక్ష నేతలు రాత్రికి రాత్రి అక్కడకు వెళ్లి టిప్పర్లను బంద్‌ చేయించారు. అక్కడున్న సూపర్‌వైజర్‌ను, డ్రైవర్లను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. చెరువుకు ఆనుకొని ఉన్న ఓ బడా రియల్టర్‌ వెంచర్‌ కోసం ఈ రోడ్డును వేయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

రైతులను మభ్యపెట్టి...

చెరువును ఆనుకొని పొలాలు ఉన్న రైతులను మభ్యపెట్టి రియల్టర్లు మట్టి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మీ పొలాలకు వెళ్లేందుకు వీలుగా 60 ఫీట్ల వెడల్పుతో తమ సొంత ఖర్చులతో రోడ్డు వేయిస్తామని, తమకు సహకరిస్తే మీకూ లాభమని వారిని ఏమార్చారు. దీంతో రైతులు తమ భూములకు కూడా విలువ పెరుగుతుందని, వచ్చీపోయేందుకు రోడ్డు కూడా అణువుగా ఉంటుందన్న ఆశ వారిలో నెలకొంది. ఆ బడా రియల్టర్‌ ఉచ్చులో తాము చిక్కుకున్నామన్న సంగతి వాళ్లు ఆలస్యంగా తెలుసుకున్నారు.

ఇరిగేషన్‌ అధికారుల పరిశీలన..

సర్వే నెంబర్‌ 137లోని చెరువులో మధ్యలో మట్టిని నింపిన ప్రాంతాన్ని ఇరిగేషన్‌ ఏఈ గంగ, అధికారులు పరిశీలించారు. చెరువును కబ్జాచేసి మట్టి నింపినవారిపై కేసులు పెట్టినట్లు తెలిపారు. చెరువు కబ్జాకు గురికాకుండా నిరంతర పర్యవేక్షణ కోసం వీఆర్‌ఏను, ఇరిగేషన్‌ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.

 ప్రకృతి ప్రేమికుల ప్రయాస..

మాసాబ్‌చెరువును ఎలాగైనా కాపాడుకోవాలన్న ప్రయాస ప్రకృతి ప్రేమికులు, అఖిలపక్ష నాయకుల్లో బలంగా నాటుకుంది. సుమారు 1000మందితో వాట్సప్‌గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని నిరంతరం మానిటర్‌ చేసుకుంటున్నారు. సుమారు నెల రోజుల నుంచి రాత్రింబవళ్లు జాగారం చేస్తున్నారు. చెరువు పరిసరాల్లోనే ఉంటూ టిప్పర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్లు రియల్టర్లకు అనుకూలంగా ఉన్నా... తాము న్యాయం కోసం పోరాడతామని దీక్ష బూనారు. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News