ఈ నెల 15వ తేదీ నుంచి మైసిగండి మైసమ్మ తల్లి ఆలయ ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ఉత్సవాలు ఈ నెల 15 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
దిశ,ఆమనగల్లు ::-రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ఉత్సవాలు ఈ నెల 15 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తుల కోర్కెలు తీరుస్తూ.. ఈ ప్రాంతవాసులకు అమ్మవారు కొంగు బంగారంగా నిలిచారు.6 రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.కార్తీక మాసంలో జరుగనున్న ఈ జాతరకు జిల్లావాసులే కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, వనపర్తి, మేడ్చల్, నాగర్‌కర్నూల్, మెదక్, ఉమ్మడి నల్గొండ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రకరకాల పూలు, మామిడి, కొబ్బరి తోరణాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. అలాగే మైసమ్మ ఆలయ సమీపంలోని శివాలయం, రామాలయం వద్ద కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఆవరణలోని కోనేరు నీటితో నిండి భక్తులకు కనువిందు చేస్తున్నది.
జాతర కార్యక్రమాల వివరాలు..
ఈ నెల 15 న ఆలయ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు,విశేష అలంకరణ,16 న విశేష పూజలు, రాత్రికి చిన్నతేరు,17న పెద్దతేరు,18న శత చండీ హోమము,విశేష పూజలు, అమ్మవారికి బోనాలు బండ్లు తిప్పుట,19న శత చండీ హోమము,విశేష పూజలు కార్తీక దీపోత్సవం,20న శత చండీ హోమం, పూర్ణాహుతి,అమ్మవారికి వివిధ కూరగాయలతో అలంకరణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు.
జాతరకు ఏర్పాట్లు చేస్తున్నాం..
-శిరోలీపంతూనాయక్, ట్రస్ట్ చైర్మన్, మైసమ్మ తల్లి ఆలయం
గండి మైసమ్మ తల్లి జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరు రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ ఆవరణలో వసతులు, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నాం
వసతులు కల్పిస్తున్నాం
మైసమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహిస్తాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని వసతులను కల్పిస్తాం.ఆలయాన్ని పూలు, మామిడి తోరణాలతో సుందరంగా ముస్తాబు చేస్తాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
-స్నేహలత, ఈవో,మైసిగండి మైసమ్మ ఆలయం