కొత్త చెరువు గండి..మా పాలిటి నీటి గండం..చెరువైన కాలనీ..

పరిగి కొత్త చెరువు కట్టకు గండి కొట్టించి యథేచ్చగా శిఖం

Update: 2024-10-03 12:47 GMT

దిశ,పరిగి : పరిగి కొత్త చెరువు కట్టకు గండి కొట్టించి యథేచ్చగా శిఖం, నాలా, బపర్​ జోన్లలో నిర్మాణాలు చేపట్టడంతో సమీప కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి. హైదరాబాద్​ –బీజాపూర్​ అంతర్​ రాష్ట్ర రహదారి పక్కనే కొత్త చెరువు ఉండటంతో రియల్టర్ల కన్నేసి కబ్జా చేసి యథేచ్చగా లే–అవుట్లు చేసి విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి వానాకాలం భారీ వర్షాలు కురియడంతో ఒక్కసారిగా మున్సిపల్​ లోని 3వ వార్డును వరద ముంచెత్తుతుంది. కాలనీలోని రోడ్లన్నీ వరద కాలువలుగా మారి కనీసం ఇళ్లు నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంటుందని మూడవ వార్డులోని సాయిరాం నగర్​ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి వానాకాలం కొత్త చెరువు నుంచి వరద నీటితో సమీపంలోని సన్​ సిటీ, సాయిరాం కాలనీలన్నీ చెరువులు, కుంటలను తలపించేలా వరద నీరు ఇళ్ల మద్యనే చేరుతుంది.

నిర్మాణాలు,కబ్జాల వల్లే నీరంతా డైవర్షన్​..

కొత్త చెరువును 45 సంవత్సరాల క్రితమే 254, 256, 257 నిర్మించినట్లు పరిగిలో70 ఏళ్లకు పైబడిన వృద్ధులు(పెద్దలు ) చెబుతున్నారు. కాగా 254 సర్వే నెంబర్ లో 13.27 ఎకరాలు, 256 సర్వే నెంబరులో 2.12 ఎకరాలు, 257 లో 17.19 ఎకరాల భూమి ఉన్నట్లు ఆనాటి అడంగల్​ పహాణి , నేటి ధరణి పోర్టల్​ లో మూడు సర్వే నెంబర్లలో కలిపి 33.18 ఎకరాల భూమి ఉన్నట్లు చూపిస్తుంది. కాగా చెరువును మొత్తం మూడు సర్వే నెంబర్లలోని 33.18 నిర్మించారని, మరి కొందరు కొంత మిగులు భూమిని వదిలేసి 28.18 ఎకరాల్లో చెరువును నిర్మించారంటూ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ కొత్త చెరువు మూడు నుంచి నాలుగు ఎకరాల మాత్రమే ఉందని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని పరిగి మున్సిపల్​ ప్రజలను అంటున్నారు. కట్టా కూలగొట్టడం, శిఖం లో నిర్మాణాలు చేపట్టడం, నాలాల్లోనే ఇళ్లు నిర్మించడం, గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అనుమతులు ఇస్తే ఏదో అనుకోవచ్చు. మున్సిపల్​ అయ్యాక కూడా ఇళ్ల బఫర్​ జోన్లు, నాలాల్లో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో నీరంతా సమీపంలోని కాలనీల్లోని ఇళ్లలోకి చేరుకుంతుంది.

కుంటలైన కాలనీలు..వాగులైన రోడ్లు

ప్రతి వానాకాలంలో భారీగా వర్షాలు రావడం చెరువులో నీరు నిలువకుండా పూర్తిగా కట్టలను ధ్వంసం చేయడంతో సమీపంలోని కాలనీలను వరద ముంచెత్తుతుంది. పరిగి మున్సిపల్​ పరిధిలోని సర్వే నెంబరు 20, 21, 22, 201, 205లలో నిర్మించిన కాలనీలన్నీ కుంటలను తలపిస్తున్నారు. భారీగా వర్షం కురిసిందంటే వరదలు వచ్చి ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా, బయట వారు ఇళ్లకు వెళ్లకుండా ఐదారు గంటలు ఎదురు చూడాల్సి వస్తుందంటూ సాయిరాం కాలనీ, సన్​ సిటీ కాలనీ, గౌరమ్మ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు, కార్ లలోకి వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సారి భారీగా వర్షాలు కురియడంతో ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంటే మున్సిపల్​ అధికారులుకు ఫిర్యాదు చేశారు. కమిషన్​ వెంకటయ్య, వార్డు ఇంచార్జి ఆగయ్య, కౌన్సిలర్​ వేముల కిరణ్​ కుమార్​ గుప్తా, నాయకులు ఎజాజ్​ తదితరులు పరిశీలించి వరద నీరు రాకుండా కాలువ ఎత్తు పెంచుతామని చెప్పి వెళ్లారు. చుట్టపు చూపుగా కాకుండా పనిచేసే విధంగా ప్రణాళికలు తయారు చేసి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

పడవలు వేసుకొని వెళ్లాలా : ముడావత్​ ఠాగూర్​ ( సాయిరాం కాలనీ వాసి )

ఈ సారి భారీగా వర్షాలు కురియడంతో కొత్త చెరువు నీరంతా మా కాలనీని ముంచెత్తింది. ఇంట్లోంచి బయటికి చూస్తే వరద శబ్దంతో ఇంట్లోని మహిళలంతా భయంభయంగా ఉంటున్నారు. కాలనీ మొత్తం కుంటను తలిపించింది.ప్రతి వానాకాలం ఇదే సమస్యతో సతమత మవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువులో చుక్క నీరు నిలువ ఉండకుండా కట్టలను తెంచేస్తే కాలనీలు చెరువులుగా మారుతున్నాయి. కాలనీలో వర్షాకాలం వేస్తే పడవలు వేసుకొని రోడ్లపై వెళ్లే పరిస్​థితి దాపురిస్తుంది.

వరదలో కారు కొంత దూరం కొట్టుకు పోయింది : కావలి భీమయ్య ( సాయిరాం కాలనీ వాసి )

వర్షకాలం వచ్చిందంటే మా కాలనీకి వరద నీరు విఫరీతంగా వస్తుంది. కాలనీకు దూరంగా కాలువ వరద ఉన్నా అది నిండుగా ప్రవహించి ఇళ్లలోకి వరద నీరు వస్తుంది. హైవే రోడ్డు నుంచి వరద కాలువ ఎత్తును పెంచి, చెరువు కట్టను పునర్​ నిర్మిస్తే కాలనీలోకి నీరు రాకుండా ఉంటుంది. గతంలో వరధ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇంటి ముందు రోడ్డుపై పార్క్​ చేసిన కారు కొంత దూరం కొట్టుకు పోయి ఆగింది. బైకులు వరద నీటిలో సగానికి పైగా మునిగి పోయాయి. ప్రతి వానాకాలం ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భారీ వర్షం పడి వరదలు వస్తే మా ఇంటి నుంచి వరద నీటితో కుంటుంబీకులు ఇంట్లో భయపడుతూ ఉంటున్నారు. కాలనీలోకి వరద నీరు రాకుండా మున్సిపల్​ అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలి.


Similar News