దిశ, బొంరాస్‌పేట్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, మండల నాయకులు ఖండించారు. గురువారం మండల పరిధిలోని తుంకిమెట్ల గ్రామంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ''రేవంత్ రెడ్డి గురించి, మా అన్నదమ్ముల గురించి మీరా మాట్లాడేది, ఒకసారి మీ చరిత్ర తెలుసుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి'' అని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఎమ్మెల్యే విసిరిన సవాల్‌కు తాము సిద్ధంగా ఉన్నామని, తేదీ, స్థలం చెబితే వస్తామని ప్రతి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే స్థాయి మరచి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
అధికారం అనేది శాశ్వతం కాదని, ఎమ్మెల్యే చేసిన దందాలు, కబ్జాలు గురించి టైం వచ్చినప్పుడు బయటపెడతానని, కొడంగల్ ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో పోలీస్ బందోబస్తు మధ్య గ్రామాల్లో తిరిగే ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. ఈ పనులు చేసే స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలదని గుర్తుంచుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకొని మరో సిరిసిల్ల చేస్తానంటే ఎమ్మెల్యేగా నరేందర్ రెడ్డిని గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో కొడంగల్ అంటే తెలియని వారు ఉండరని, కొడంగల్ గురించి దేశ స్థాయిలో వినిపించిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.
మరోసారి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే సహించేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సిములుగౌడ్, వెంకట్ రాములు గౌడ్, రాజేష్ రెడ్డి, మెరుగు వెంకటయ్య, వీరేశలింగం, అంజిల్ రెడ్డి, కలీమ్, దేశ్యానాయక్, మల్లికార్జున్, భీమయ్యగౌడ్, దశరథ్ యాదవ్, మొగులయ్య, మల్లేశం, బ్యాగరి రాములు, యుగంధర్ రెడ్డి, సంతోష్ నాయక్, అంజి, రాఘవేందర్ రెడ్డి, రతన్, భాస్కర్ నాయక్, సర్పంచులు మహేందర్, కాశప్ప, మేగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.