అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేపై సంబంధిత అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.

Update: 2024-12-12 15:03 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేపై సంబంధిత అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మొదటి దశలో సొంత స్థలం కలిగి ఉన్న వారిని, ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రజాపాలనలో జిల్లాలో 3 లక్షల 75 వేల 13 దరఖస్తులు రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, వర్డ్ అధికారితో పాటు ఇతర అధికారులను కూడా నియమించడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలిన కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

ఈ ఇండ్ల నిర్మాణానికి బేస్మెంట్ స్థాయిలో కొంత, రూప్ లెవెల్ లో కొంత మొత్తంగా ప్రతి ఒక ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా స్థలంలేని నిరుపేదలకు కూడా రెండవ దశలో ఇండ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. మండల స్థాయి నుంచి ఇద్దరు చొప్పున, మున్సిపాలిటీల నుంచి నలుగురు చొప్పున ఎంపిక చేసి మాస్టర్ ట్రైనర్ల చేత శిక్షణ ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ, తప్పిదాలకు తావులేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వపరంగా లబ్ది చేకూరేందుకు వీలుగా వివరాల నమోదులో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఇందిరమ్మ ఇంటింటి సర్వేను ఒక ప్రణాళికా పరంగా నిర్వహించాలని అన్నారు.

సర్వే నమోదులో ఏదైనా సమస్యలు వస్తే, నివృత్తి చేయడానికి ప్రతి మండలంలో, మున్సిపాలిటీ పరిధిలో కంట్రోల్ రూములను, అదే విధంగా కలెక్టరేట్ లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తారని అన్నారు. ఈ నెల 16 వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం అవుతుందని అన్నారు. సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఈ నెల 15, 16వ తేదీలలో గ్రూప్-II పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే కేంద్రాలకు వెళ్ళి ఏర్పాట్లను చూడాలని అన్నారు. రూట్ ఆఫీసర్లు, పోలీస్ నోడల్ అధికారులు, చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా స్పెషల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News