భవాని.. ఇక సెలవు..
శరన్నవరాత్రుల్లో పూజలు అందుకుని, భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత గంగమ్మ ఒడికి చేరింది.
దిశ, చేవెళ్ల : శరన్నవరాత్రుల్లో పూజలు అందుకుని, భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత గంగమ్మ ఒడికి చేరింది. చేవెళ్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి పుష్కరిణి ఆవరణలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం జరిగింది. వివిధ గ్రామాలలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలను బుధవారం బ్యాండ్ బాజాలతో ఊరేగించి పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల రచ్చబండలో ప్రతిష్టించిన దుర్గామాత అత్యంత శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చింది.
నిమజ్జనం కార్యక్రమానికి ముందు భవాని చీరలకు వేలం పాట నిర్వహించగా తూర్పు లింగారెడ్డి పదివేల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంగళి యాదగిరి మాట్లాడుతూ దుర్గామాతను ప్రతిష్టించటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తొమ్మిది రోజులు పాటు నిత్యాన్నదానం చేసిన వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.