ఇందిరమ్మ ఇళ్లపై సందేహాలుంటే ఫోన్ చేయండి : కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
దిశ, రంగారెడ్డి బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండలాల ప్రత్యేక అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సర్వేయర్లు ఇంటింటికి తిరిగి సక్రమంగా మొబైల్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు.
ఈ నెలాఖరులోగా వందకు వంద శాతం సర్వే పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 7674961606కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలియజేశారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ పరిధిలోని వార్డ్ అధికారిని, గ్రామాలలో ఉండేవారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి సందేహాలు నివృత్తి తీసుకోవచ్చని అన్నారు. ముందుగా సమగ్ర ఇంటింటి సర్వే, గ్రూప్-II పరీక్షలు విజయవంతంగా నిర్వహించి నందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు.