అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి :సిపిఐ నాయకులు
పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో నిర్మించిన అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో : పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో నిర్మించిన అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలున్నప్పటికీ చర్యలు చేపట్టకుండా మున్సిపల్ నిధులు దుర్వినియోగం పరుస్తూ వైస్ చైర్మన్ భర్త చామ విజయశేఖర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న కమీషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెంట్ మండలం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో గత 8 నెలల క్రితం సర్వేనెంబర్ 233 నుండి 237 వరకు గల భూమి లో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా గోదాముల నిర్మాణం చేపట్టారని అన్నారు. ఈ గోదాములపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ కమిషనర్ కంటితుడుపు చర్యలు తీసుకొని, గోదాములు యధావిధిగా ఉండేవిధంగా యజమానుల వ్యాపారాలకు సహకరించారని ఆరోపించారు.
అదేవిధంగా విజయవాడ హైవే ఇరువైపుల కోకొల్లలుగా అక్రమ భవనాలు, గోదాములు నిర్మించుకున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసిచూడనట్లు వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి నష్ట పరుస్తున్నారన్నారు. కుంట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 185 లో సుమారు 95 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉందని, చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ల నుంచి వైస్ చైర్మన్ కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమి రోడ్డుకు 40 ఫీట్ల రోడ్డును వేయగా, వేసిన రోడ్డుకు మున్సిపాలిటీ కౌన్సిల్లో తప్పుడు తీర్మాణం చేయించి రోడ్డుకు రూ.20 లక్షలు మంజూరు ఇప్పించి ఎస్టిఎల్, బఫర్ జోన్ లోవున్న వ్యవసాయ బావికి రోడ్డు వేయుటకు కమిషనర్ సహకరించారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తప్పుడు పద్ధతులలో ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న రోడ్డును తీసువేసి, చెరువును కాపాడాలని, అక్రమ గోదాముల నిర్మాణం, బహుళ అంతస్తుల నిర్మాణాలపై విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆందోజు రవీంద్ర చారి, ముత్యాల యాధి రెడ్డి, హరి సింగ్ నాయక్ లు పాల్గొన్నారు.