తాండూరు ఆర్టీఏ కార్యాలయంలో బ్రోకర్లదే ఇష్టారాజ్యం
తాండూరు పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయంలో బ్రోకర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
దిశ, తాండూర్ పట్టణం : తాండూరు పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయంలో బ్రోకర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన కాడికి దోచుకుంటున్నారు. తాండూరు పట్టణంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయం వారానికి కేవలం ఒక్కరోజే మంగళవారం మాత్రమే సేవలు ఉంటాయి. ఒకప్పుడు మంగళ, శుక్రవారాలలో కార్యాలయ సేవలు కొనసాగేది. వికారాబాద్ జిల్లాలోని వ్యాపార రంగంలో, రవాణా రంగంలో వేల సంఖ్యలో భారీ వాహనాలు వ్యాపార నిమిత్తం రవాణా కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లాలోని రవాణా రంగంలో రెవెన్యూ రంగంలో తాండూరు ముఖ్యమైనది. కానీ వారానికి ఒక్కరోజు మాత్రమే రవాణా కార్యాలయం విధులు ఉండడంతో సేవల కోసం వచ్చే వినియోగదారులు పలు విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కంప్యూటర్ సర్వర్ పనిచేయక, ఇంటర్నెట్ అంతరాయం, తగు సిబ్బంది లేక తదితర సమస్యలు ఉన్నాయి.
అదే అదునుగా బ్రోకర్లు వినియోగదారుల దగ్గర వచ్చిన కాడికి డబ్బులు తీసుకుంటూ తమ పనులు చేయిస్తామని చెప్తూ నిలువునా దోచేస్తున్నారు.స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి కానీ వారి కన్నా ముందే బ్రోకర్లు కార్యాలయంలో తిష్ట వేసుకొని పదుల సంఖ్యలో ఫైలను పట్టుకొని కూర్చుంటున్నారు. దళారుల బెడద లేకుండా అధికారులు పర్యవేక్షించాలి కానీ వారి పనిపై వాళ్లు ఉండడంతో వీళ్లు అదే అదునుగా భావిస్తున్నారు. ఎవరి పేరుతో స్లాట్ బుక్ అవుతుందో తెలుసుకొని వారిని టార్గెట్ చేసి డైవర్ట్ చేసి డబ్బులు గుంజి పనులు పూర్తి చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా రవాణా సేవలు గురించి కార్యాలయం గేటు దగ్గర ఉండగా సిబ్బంది వారికి వివరాలు తెలిపే లోపే వారిని బ్రోకర్లు లోపరుచుకుంటున్నారు. ఒక్కో బ్రోకరు 10 అప్లికేషన్లు పైగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వెంటనే బ్రోకర్లు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయ పని దినాలు కేవలం మంగళవారం ఒక్కరోజే కాకుండా మంగళవారం తో పాటు శుక్రవారం రోజుల్లో కూడా కార్యాలయ పని దినాలు కల్పించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా వినియోగదారులు అధికారులను సంప్రదిస్తే ఎలాంటి సేవలు పూర్తి కావడం లేదు. దీంతో బ్రోకర్లు ఎంతో కొంత డబ్బులు తీసుకొని కొందరు అవినీతికి పాల్పడే అధికారులతో చేయి కలిపి ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారని వినికిడి. ఇకనైనా బ్రోకర్లను రవాణా కార్యాలయానికి రాకుండా చూస్తూ వినియోగదారులకు మంచి సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.