చెరువుల కబ్జాపై హైడ్రా నిఘా

భూ వ్యాపారులు ఇష్టానుసారంగా అధికారులను ప్రభావితం చేసి చెరువులను, కుంటలను మాయం చేశారు.

Update: 2024-09-13 16:02 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో : భూ వ్యాపారులు ఇష్టానుసారంగా అధికారులను ప్రభావితం చేసి చెరువులను, కుంటలను మాయం చేశారు. ప్రధానంగా రియల్​ ఎస్టేట్​ పేరుతో చదును చేసి లేఅవుట్లు చేస్తున్నారు. అయితే పట్టా భూముల్లో కూడా చెరువులున్న గ్రామాలున్నాయి. కానీ ఆ భూములను క్రయ విక్రయాలు చేసినప్పటికి కేవలం సాగుకు మాత్రమే వాడుకోవాలి. ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని రెవెన్యూ, ఇరిగేషన్​ చట్టంలో ఉంటుంది. ఇవేవీ లెక్కచేయకుండా ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులు తాయిలాలకు ఆశపడి ఇష్టానుసారంగా ఎన్​వోసీలు, అనుమతులు ఇవ్వడం విడ్డూరం.

    అధికారులు చేసిన తప్పిదాలతో రియల్​ వ్యాపారులు సొమ్ము చేసుకొని సాధారణ ప్రజలను బలిపశువులు చేశారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నెల రోజులుగా గ్రేటర్​ హైదరాబాద్​, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కానీ రియల్​ వ్యాపారులు చేసిన మోసాలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో చెరువులు పూర్తిగా మాయమైనట్లు తెలుస్తోంది.

గొలుసుకట్టు చెరువులకు మంగళం....

గొలుసుకట్టు చెరువులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్​ అడ్రాస్​... ఇలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఉంది. కానీ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు తమకు అనుకూల వ్యక్తలను ప్రోత్సహించి ఆక్రమించుకున్నారు. దీంతో నీళ్లు నిలిచే చెరువుల్లో ఇండ్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్లే మార్గాలను సైతం మూసివేశారు. ఈవిధంగా చేయడంతో నగరమంతా జలమయమై రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    నగరవాసులకు నీటిని అందించే జంట జలాశయాలు సైతం కలుషితమయ్యేలా నిర్మాణాలు చేపట్టారు. ఈ జలాశయాలను కాపాడుకునేందుకు 111 జీవోతో పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదు. అయినప్పటికీ అధికారులను అడ్డంపెట్టుకొని రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టిన వైనం కనిపిస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్​, మేడ్చల్​ జిల్లాలో కలిపి మొత్తం 2857 చెరువులున్నాయి. ఇందులో 50 శాతంపైగా చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులే కావడం విశేషం. ఇప్పుడు ఆ చెరువులకు మంగళం పాడినట్లు తెలుస్తోంది.

ఏరియల్​ సర్వేతో గుర్తించిన చెరువులు...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాలకు గురైన చెరువులను హైడ్రా సేకరించింది. ఇరిగేషన్​, రెవెన్యూ అధికారుల సహాయంతో ఏరియల్‌ సర్వే రిపోర్టు రూపొందించినట్లు అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువుల సంఖ్య, ఒక్కొక్క చెరువు విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం ఎంత విస్తీర్ణం ఉందనే అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే చెరువుల సంఖ్య నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగైనట్లు కూడా హైడ్రా గుర్తించింది. క్షేత్రస్ధాయిలోని రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులతో హైడ్రా సంప్రదించి నోట్​ పైల్​ పెట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది.

    కొన్ని చెరువులు 50 నుంచి 60 శాతం వరకు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా రిపోర్టు వెల్లడించింది. ఇందుకు నిదర్శనం మహేశ్వరం మండల పరిధిలోని సర్థార్‌నగర్‌ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 2లో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తుమ్మల చెరువు ఆనవాలు కూడా కనిపించక పోవడంతో ఇటీవల స్థానికులు మా తుమ్మ చెరువు కనిపించడం లేదు.. వెతికి పెట్టండి అని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇలా ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూముల్లో వెలిసిన నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో రాజేందర్‌నగర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో సుమారు 60 ఎకరాల చెరువు శిఖంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. అక్రమార్కుల చేతిలో ఉన్న వందల ఎకరాల శిఖం భూముల నిర్మాణలు కూల్చనున్నట్టు హైడ్రా వెల్లడిస్తోంది.

పాత మండలాల ప్రకారం కబ్జాకు గురైన చెరువుల సంఖ్య ఇలా..... 

 

Tags:    

Similar News