రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాలపై దేవాదాయ శాఖ అధికారుల కోరడా
దేవాదాయ భూముల అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు
దిశ,శంషాబాద్ : దేవాదాయ భూముల అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని అత్తాపూర్ లో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి చెందిన 4.26 ఎకరాల భూమిలో కొందరు అక్రమార్కులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి అక్రమంగా షెడ్లు,హోటల్లు,కారు షోరూమ్ లు,క్రికెట్ గ్రౌండ్, అక్రమ నిర్మాణాలు చేశారని ఫిర్యాదు రావడంతో గురువారం రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ,డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ లతో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. ఈ తరుణంలో అక్రమ నిర్మాణదారులు అక్రమార్కులు అధికారులతో దిగారు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టులో నాట్ ఇంటర్ ఫెయిర్ ఆర్డర్లు తెచ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిలో భాగంగా కోర్టులో దేవాదాయ శాఖ తరఫున కేసు వేసి దానిపై భూమి దేవాదాయ శాఖకు చెందుతుందని ఆర్డర్ వచ్చిన తరుణంలో పై అధికారుల ఆదేశాలతో గురువారం పోలీస్ బందోబస్తు మధ్య దాదాపు 400 కోట్ల విలువ చేసే 4.26 ఎకరాల భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడం జరిగింది. ఈ దేవాదాయ భూమి అన్యాక్రాంతం అయ్యిందని పత్రికలలో మీడియాలో రావడం వల్ల ఈ భూమిని కాపాడడం లో మీడియా పాత్ర కూడా కీలకంగా ఉందన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దేవాదాయ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.