మంటగలిసిన మానవత్వం.. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తి కాజేసిన వైనం

మానవత్వం మరోసారి మంటగలిసింది.

Update: 2024-09-18 08:05 GMT

దిశ, నవాబుపేట: మానవత్వం మరోసారి మంటగలిసింది. తోడబుట్టిన తమ్ముడి బాగోగులను చూస్తూ అతడి ఉన్నతికి దోహదపడాల్సిన సొంత అన్న, తమ్ముడి ఆస్తి కాజేసిన వైనం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని కిషన్‌గూడ గ్రామానికి చెందిన కల్మి చెన్నయ్యకు బాలయ్య, అంజయ్య, కేశవులు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో బాలయ్య, కేశవులు అమాయకులు కాగా రెండో కుమారుడు అంజయ్య వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి భూములపై కన్నేశాడు. ఈ క్రమంలోనే గత నెల 7న తమ్ముడు కేశవులు పేరున ఉన్న భూమికి సంబంధించి రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకుందామని చెప్పి తమ్ముడిని అంజయ్య నమ్మించాడు.

తన వెంట కేశవులను నవాబుపేట తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ రుణమాఫీ గురించి అధికారులను అడుగుతున్నట్లు నటించి అతడి పేరున లింగంపల్లి గ్రామ శివారులోని సర్వే నెం. 71,72లో ఉన్న ఎకరం భూమిని తన కొడుకు రాము పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ సమయంలో తమ గ్రామానికి చెందిన వారిని సాక్షులుగా పెడితే తన బాగోతం బయట పడుతుందని అంజయ్య భావించాడు. మండల పరిధిలోని పుర్సంపల్లి గ్రామానికి చెందిన శ్రీను, గోపాల్ అనే వ్యక్తులను సాక్షులుగా పెట్టి రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేయించాడు.

అయితే, తమ్ముడిని అపారంగా నమ్మే కేశవులు అక్కడ జరిగిన విషయం ఏంటో అర్థం కాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. కొన్నా్ళ్లకు అన్న అంజయ్య తనను మోసం చేసి అక్రమంగా తన భూమిని కొడుకు పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిసి అవాక్కయ్యాడు. అదేవిధంగా గ్రామ పెద్దల దృష్టి తీసుకెళ్లాడు. పంచాయతీ పెద్దలు అంజయ్యను మందలించారు. అతడి కుమారుడు రామును పంచాయతీకి పిలిచి భూమిని తిరిగి కేశవులు పేరు మీద చేయాలని అన్నారు. అయితే, ఎన్నిసార్లు పంచాయితీ పెట్టి చెప్పినా వారు వినిపించుకోకపోవడంతో గ్రామ పెద్దలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంతో విసిగి వేసారిన గ్రామస్తులు, పెద్దలు మూకుమ్మడిగా బాధితుడు కేశవులుతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చెపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంజయ్యపై తహసీల్దార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అసలు తహసీల్దార్ కార్యాలయానికే రావడం లేదని అన్నారు. ఇక చేసేదేమి లేక వారంతా ఆవేదనతో కార్యాలయం‌‌లో అధికారులకు వినతిపత్రం అందజేసి స్వగ్రామానికి బయలుదేరారు. ఇదే విషయమై ఎస్సై విక్రం కూడా స్పందించారు. బాధితుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ తమకు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.


Similar News