దంచికొట్టిన వాన
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో గురువారం ఉదయం నుండే భారీ వర్షం కురిసింది.
దిశ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో గురువారం ఉదయం నుండే భారీ వర్షం కురిసింది. మేఘానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన జోరు వానకు రహదారులన్నీ వాగులను తలపించాయి. దంచికొట్టిన వానకు మండల ప్రజలు దసరా ఉత్సవ సందర్బంగా ఉక్కిరిబిక్కిరయ్యారు. బయటకు వెళ్లకుండా జోరు వాన కొనసాగింది.
అన్ని మండలాల్లో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. ఆమనగల్లు మండలంలో 12సెంటిమిటర్ల, తలకొండపల్లి మండలంలో 8సెంటిమిటర్ల, కడ్తాల్ మండలంలో 6సెంటిమిటర్ల వర్షపాతం నమోదయింది. ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ శంకర్ కొండ మధ్య గల కత్వవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గిరిజనుల ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
వంతెన హామీలు గాలి మూటలేనా
ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ శంకర్ కొండ తండాల మధ్య ఉన్న తత్వం వాగుపై వంతెన నిర్మాణం కోసం 8నెలల క్రితం రాష్ట్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వంతెన నిర్మాణం జరగలేదు. గిరిజనులు ఆందోళన చేపట్టి నిరసన చేపట్టడంతో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్పందించి కాంట్రాక్టర్ ని తొలగించి, నూతన కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.
దసరా పండుగ వేళ కురిసిన భారీ వర్షాల కారణంగా గిరిజన గ్రామాల ప్రజలు స్పందన లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మంగళపల్లి చెన్నారం రోడ్డు సరిగ్గా లేక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు రైతులకు, ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైతులు పొలాలకు వెళ్లే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వ తీరుపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణాలు చేపట్టి ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.