Gandipet: డబుల్ లే అవుట్‌.. పార్క్ అవుట్

అత్యంత ప్రాధాన్యం కలిగిన కోట్ల విలువ చేసే గండిపేట ప్రాంతంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2024-11-21 02:16 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో / గండిపేట్: అత్యంత ప్రాధాన్యం కలిగిన కోట్ల విలువ చేసే గండిపేట ప్రాంతంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే తాము చెప్పిందే వేదం అన్నట్టుగా రియల్ వ్యాపారులు, బిల్డర్లు వ్యవహరిస్తున్నారు. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఈనాడు కాంగ్రెస్ ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేసిన స్థలంలో కబ్జాదారులు నేడు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కోకొల్లాలుగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్, భవన నిర్మాణంలో కావాల్సిన అనుమతుల్లో ఉండే లొసుగులను ఆసరా చేసుకొని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, లేఔట్లను సృష్టిస్తున్నారు. అదే సామాన్యుడు ఎలాంటి చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకొని వేధిస్తుంటారు. రాజకీయ పలుకుబడి ఉన్న నేతల ముసుగులో బిల్డర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు లేఅవుట్లలో కబ్జాలు చేసే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు ఆడిందే ఆటగా సాగుతున్నది.

రాధానగర్ ఫేస్-2లో పార్కు స్థలం మాయం..

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని హైదర్షాకోట్‌లోని 15/1లో చేసిన రాధానగర్ ఫేస్ 2లో పార్కు మాయం అయ్యింది. రాధానగర్ ఫేస్ 2లో మొదటిగా చేసిన లేఅవుట్‌లో పార్కు స్థలం చూపించగా.. రెండో లేఅవుట్‌లో పాల్కు స్థలాన్ని ఫ్లాట్‌గా చూపించారు. దీంతో ఓ బిల్డర్ దాదాపు 500 గజాల స్థలంలో డబుల్ లేఔట్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ మున్సిపల్ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకొచ్చారు. కానీ స్థానిక కాలనీవాసులు పలుసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఫ్లాట్ నంబర్ 20కి తూర్పు రాగా.. పడమర ప్లాట్ నంబర్ 21, దక్షిణానికి ఫ్లాట్ నంబర్ 27, ఉత్తరానికి 40 ఫీట్ల రోడ్డు ఉంది. ఇలా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీల హద్దులు నిర్ణయించారు. ఈ హద్దులకు అనుగుణంగా ఈస్ట్‌లో ఉన్న పార్కులో బహుళ అంతస్తులు నిర్మించిన పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు తెలుస్తున్నది. అసలు ఇప్పుడు రాధానగర్ ఫేస్ 2లో పార్కు కనిపించకపోవడం గమనార్హం.

ప్లాటినం నెస్ట్ భవనం కబ్జానా..?

రాధానగర్ ఫేస్ 2లో కబ్జా చేసి పార్కు స్థలంలో ప్లాటినం నెస్ట్ కంపెనీ అపార్ట్మెంట్ నిర్మించింది. హైదర్షాకోట్ రెవెన్యూ పరిధిలోని 15/1లోని రాధానగర్ ఫేస్ 2 లేఅవుట్‌లో పార్కు స్థలం మాయమైనట్లు స్థానికులు కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తున్నది. ఈ కబ్జా స్థలంలో చేపట్టిన నిర్మాణం వెనుక గత ప్రభుత్వం పెద్దల సహకారంతో ఈనాటి అధికార పార్టీకి చెందిన ఓ నేత ఉన్నట్లు సమాచారం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్లతో సఖ్యతగా ఉంటూ అక్రమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటారని ప్రచారం ఉంది.

Tags:    

Similar News