ప్రజాపాలన ప్రచార కళాయాత్రను ప్రారంభించిన కలెక్టర్

ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజా పాలన ప్రచార కళా యాత్ర కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

Update: 2024-11-20 15:10 GMT

దిశ ప్రతినిధి వికారాబాద్ : ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజా పాలన ప్రచార కళా యాత్ర కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లాలో మంగళవారం నుంచి ప్రజా పాలన - విజయోత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంగా ఈ విజయోత్సవాలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జెండా ఊపి కళా యాత్ర వాహనమును ప్రారంభించారు. విజయోత్సవాలలో భాగంగా జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక కళాకారులు నేటి నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతిరోజు 3 మేజర్ గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు కళా ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామ, మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా టీఎస్సెస్ కళాకారులు తమ ఆటా పాటలు, ద్వారా అవగాహన కల్పించడం ఈ కళా యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లాలో కళాకారులు ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకాలపై పాటలు పాడుతూ ప్రజా కళా యాత్రను ముందుకు తీసుకెళ్లానున్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ కృష్ణవేణి, సాంస్కృతిక శాఖ కళాకారుల బృందం, జిల్లా పౌర సంబంధాల కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News