దిశా, శంకర్పల్లిః మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎత్తు ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గేటెడ్ కమ్యూనిటీని ముంచింది. పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. విల్లాస్ లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. శంకర్ పల్లి మండలం మోకిలా గ్రామంలోని లా పొలామా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో నివాసముంటున్న విల్లా యజమానుల ఆవేదన. మోకిలా తండా, కొండకల్ తాండ తదితర గ్రామాల పరిధిలో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు ఒక్కసారిగా ఉదృతంగా ప్రవహించింది. ఇక్కడే ఉన్నటువంటి చిన్నచిన్న కాలువలు నాళాలు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్ విల్లాస్ లు నిర్మించారు. వ్యాపారమే ధ్యేయంగా విల్లాస్ నిర్మించి అమ్మడంతో నగర జీవితానికి దూరంగా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ విల్లాస్ కొనుగోలు చేసి కుటుంబ సభ్యులతో సహా నివసిస్తున్నారు. లా పొలామా విల్లాస్ లో సుమారు 212 కుటుంబాలలో సుమారు వెయ్యి మంది వరకు నివసిస్తుంటారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే మాదిరిగా వరద నీరు విల్లాస్ లో ప్రవేశించడంతో అప్పటి పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశానుసారం ఇరిగేషన్ అధికారులు వచ్చి తాత్కాలికంగా వరద నీరు వెళ్లేందుకు మాత్రం మార్గం ఏర్పాటు చేశారని శాశ్వతమైన పరిష్కారం చేయడంలో ఇరిగేషన్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విల్లాస్లో నివసిస్తున్న యజమానులు ఆరోపిస్తున్నారు.