కాముని చెరువులో మట్టి డంపింగ్ చేస్తూ.. రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు

శంషాబాద్‌లో కబ్జా రాయళ్లు బరితెగించి చెరువులు, కుంటలు, వరద కాలువలలో సైతం మట్టితో నింపి ఆక్రమణలకు గురి చేస్తున్నారు..

Update: 2023-02-26 04:01 GMT

దిశ శంషాబాద్: శంషాబాద్‌లో కబ్జా రాయళ్లు బరితెగించి చెరువులు, కుంటలు, వరద కాలువలలో సైతం మట్టితో నింపి ఆక్రమణలకు గురి చేస్తున్నారు. తాజాగా, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాముని చెరువును కబ్జా చేశారు. ఈ చెరువు దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 20 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది.

కబ్జా రాయళ్లు రాత్రి సమయంలో లారీలలో మట్టిని తెచ్చి చెరువులో రోజుకింత మట్టి నింపి ఆక్రమిస్తున్నారు. అయినా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మూడు సంవత్సరాల క్రితం కాముని చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని పలు దినపత్రికల్లో సంబంధిత అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కూల్చివేతలు కూడా చేశారు. కానీ తాజాగా వారం నుంచి చెరువులో మట్టి నింపుతూ ఆక్రమణ గురి చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కాముని చెరువులో మట్టి పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నిందితులపై కఠిన చర్యలు

కాముని చెరువులో రాత్రి సమయంలో మట్టి నింపుతున్న సమాచారం వచ్చిందని తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వెంటనే నిందితులను గుర్తించాలని ఆర్‌ఐని ఆదేశించామన్నారు. చెరువులో మట్టి పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్ ఏఈ మౌనిక మాట్లాడుతూ.. కాముని చెరువులో గతంలోనే మట్టి నింపి ఆక్రమించారని, దీనిపై కేసులు నమోదు చేశామన్నారు. చెరువును మరోసారి పరిశీలించి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

Tags:    

Similar News