ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో శనివారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కలెక్టర్ భారతి హోలీకేరీ ప్రారంభించారు.
దిశ, శంషాబాద్ : ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో శనివారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కలెక్టర్ భారతి హోలీకేరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ చేరే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఈరోజు వికసి భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగిందని, ఈ యాత్ర జనవరి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
కేంద్రం నుండి వచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. కరోనా మహమ్మారిని సైతం ప్రధాని అరికట్టడానికి ఎంతో కృషి చేశారని దేశంలోనే 140 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చి ఎరువులు కొరత లేకుండా అందించడం జరిగిందన్నారు. రైతులకు విద్యుత్ కొరత లేకుండా చూస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాల్లో పంటకు మందు కొట్టాలంటే ఎంతో ఇబ్బందులకు గురి అయ్యేవారు అని దాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రోన్ సహాయంతో పంటలకు మందు కొట్టడానికి తీసుకురావడం జరిగిందని, ఇది దేశంలోని 15 వేల గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని ప్రారంభించడం జరుగుతుందన్నారు.
మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ముద్ర యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు రుణాలను సైతం ఇవ్వడం జరిగిందని అన్నారు. దేశం మొత్తం పారిశుధ్యం పై ప్రత్యేకమైన దృష్టిసారించి స్వచ్ఛ భారత్ గా తయారు చేశారన్నారు. కిసాన్ సమృద్ధి పథకంలో ప్రతి రైతుకు ఏడాదికి నాలుగువేల రూపాయలు అందించడం కూడా జరిగిందని అన్నారు. దేశంలో గతంలో ఎక్కడ చూసిన అల్లర్లు, మత కల్లోలాలు జరిగేవని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాక పది సంవత్సరాల దేశంలో ఎక్కడా కూడా మత ఘర్షణలు జరగకుండా శాంతి భద్రతలకు పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ కరోనా సమయంలో నుంచి ఇవ్వడం జరిగిందని,దేశంలో 82 కోట్ల మందికి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు.
గతంలో మహిళా సంఘాలకు ఐదు లక్షలు చొప్పున రుణాలు ఇచ్చేవారని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి మహిళా సంఘానికి 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్బిఐ తెలంగాణ స్టేట్ సిజిఎం రాజేష్ కుమార్, రాజేంద్రనగర్ ఆర్డిఓ మల్లయ్య, తాసిల్దార్ నాగమణి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు బొక్క నరసింహారెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, అందే బాబయ్య, శ్రీరాముల యాదవ్, వీరేందర్ గౌడ్, పాపన్న గౌడ్, రాజ్ భూపాల్ గౌడ్, ప్రేమ్ రాజ్, శ్రీధర్, చిటికెల వెంకటయ్య, చంద్రయ్య, నందకిషోర్, కొమురయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.