ప్రమాదాల మూల మలుపు...
బీటీ రోడ్డును ఇరువైపులా చెట్ల కొమ్మలు కమ్మేశాయి. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దిశ, యాచారం : బీటీ రోడ్డును ఇరువైపులా చెట్ల కొమ్మలు కమ్మేశాయి. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలోని నానక్ నగర్, గ్రామం నుంచి తాడిపర్తి, నంది వనపర్తి గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు మూల మలుపుల వద్ద కొన్నేళ్లుగా రోడ్ల పక్కన చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతో అవి నేడు రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెల రోజుల క్రితమే పిల్లిపల్లి టర్నింగ్ వద్ద నానక్ నగర్ గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్ర వాహనం కనిపించక ఢీకొంది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఇప్పటికైనా బీటీ రోడ్డు మూలమలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు.. బర్ల మల్లేశ్ యాదవ్, నానక్ నగర్ గ్రామస్తుడు
పిల్లిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు పై మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
ఇంటింటి సర్వేతో బిజీగా ఉన్నాం.. రాజు, నంది వనపర్తి సెక్రటరీ
ఇంటింటి సర్వేతో బిజీగా ఉన్నాం. నంది వనపర్తి గ్రామ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తాం. వాహనదారుల ఇబ్బందులు తొలగిస్తాం.